
మిర్యాలగూడ, వెలుగు : లక్కీ డ్రా పేరుతో లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ముగ్గురు నిందితులను శుక్రవారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్చేశారు. వన్ టౌన్ పీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్.. డీఎస్పీ రాజశేఖర రాజుతో కలిసి నిందితుల వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి చెందిన కొమ్ము రమేశ్, అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన కొమ్ము కోటేశ్వరరావు, దామరచర్ల మండల పరిధి వీర్లపాలెంకు చెందిన బచ్చలకూరి శ్రీనివాస్ కలిసి ఆర్ కే ఎంటర్ ప్రైజెస్ పేరుతో లక్కీ డ్రా స్కీమ్ ప్రారంభించారు. మొదట రూ.50, 100 లెక్కన స్కీమ్ ను ప్రారంభించి అనంతరం ఒక్కో సభ్యుడి నుంచి రూ.1000 చెల్లించేలా రూ.15 నెలలపాటు లక్కీ డ్రా స్కీంను నడిపారు.
మొత్తం 2,143 మంది సభ్యుల నుంచి రూ.1.85 కోట్లు వసూలు చేసిన ఈ సంస్థ ప్రతినిధులు రూ.50 లక్షల వరకు లక్కీ డ్రా గిఫ్టులను అందజేసి అమాయక ప్రజలను నమ్మించారు. 1300 మంది బాధితులకు రూ.1.36 కోట్లను చెల్లించకుండా ఆ డబ్బుతో ఖరీదైన ప్లాట్లు, ఇండ్లను కొనుగోలు చేశారు. స్కీమ్ గడువు ముగిశాక తమకు రూ.15 వేల నగదు, అంతకు విలువైన వస్తువులను ఇవ్వకుండా సంస్థ ప్రతినిధులు మోసం చేశారని బాధితులు ఇటీవల వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ వద్ద పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. అటువైపు బైక్పై వచ్చిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి రూ. 6.55 లక్షల నగదు, రెండు ఓపెన్ ప్లాట్ల, ఫంక్షన్ హాల్ దస్తావేజులతోపాటు రెండు బైక్ లు, వాషింగ్ మిషన్, వాటర్ ప్యూరిఫయర్, లాప్ టాప్, లక్కీ డ్రా బ్రోచర్ల కలిపి మొత్తం రూ.70 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో వన్ టౌన్ సీఐ మోతీరాం, ఎస్ఐ సైదిరెడ్డి, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.