వాట్సాప్‌‌తో బ్యాంక్​ పనులు

వాట్సాప్‌‌తో బ్యాంక్​ పనులు

న్యూఢిల్లీ: వాట్సాప్​​‌‌ గురించి కొత్తగా చెప్పేదేముంది ? దీంతో చాట్‌‌ చేసుకోవచ్చు. ఫొటోలూ వీడియోలూ పంపుకోవచ్చు. వాయిస్‌‌, వీడియోకాల్స్‌‌ చేసుకోవచ్చు. ఇదే యాప్‌‌తో బ్యాంకింగ్‌‌ సేవలు కూడా పొందవచ్చు. మీ బ్యాంకు ఖాతాలు, డెబిట్‌‌, క్రెడిట్‌‌కార్డులకు సంబంధించి అన్ని వివరాలనూ చాట్‌‌ చేస్తూనే పొందవచ్చు. అదీ ఉచితంగానే! బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమాచారం అంతా మన ఫోన్లోకే వస్తుంది. ప్రస్తుతం కోటక్‌‌ మహీంద్రాబ్యాంక్‌‌, సారస్వత్‌‌ బ్యాంక్‌‌, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌, ఏయూ స్మాల్‌‌ ఫైనాన్స్ బ్యాంక్‌‌లు వాట్సాప్​​‌‌ బ్యాంకింగ్‌‌ సర్వీసులను అందిస్తున్నాయి. త్వరలో మరికొన్ని బ్యాంకులూ వీటిని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

మొదలుపెట్టడం ఇలా…

వాట్సాప్​​‌‌ బ్యాంకింగ్‌‌ సర్వీసులను ఆరంభించడానికి సంబంధిత బ్యాంకు అందించే నంబరుకు మీ రిజిస్టర్​ నంబర్​ నుంచి మిస్డ్‌‌ కాల్‌‌ ఇవ్వాలి. వాట్సాప్​​‌‌ బ్యాంకింగ్‌‌ సర్వీసులను పొందడానికి ఇలా చేయడం తప్పనిసరి. మిస్డ్‌‌ కాల్‌‌ ఇవ్వడం ద్వారా వాట్సాప్​​‌‌ సేవలను పొందడానికి మీరు పర్మిషన్‌‌ ఇచ్చినట్టు లెక్క! కాల్‌‌ చేయగానే బ్యాంకు నుంచి వెల్‌‌కమ్‌‌ మెసేజ్‌‌లు వస్తుంది. వెంటనే ‘హాయ్‌‌’ అని టైప్‌‌ చేయాలి. స్క్రీన్‌‌పై కనిపించిన ఆప్షన్లలో మీకు అవసరమైన దానిని నొక్కాలి.

భద్రత గురించి భయం అవసరం లేదు…

వాట్సాప్​​‌‌ మెసేజ్‌‌లన్నీ ‘ఎండ్‌‌ టూ ఎండ్‌‌’ విధానంలో ఎన్‌‌క్ట్రిప్ట్‌‌ అవుతాయి.   రహస్యంగా చదవడం సాధ్యం కాదు. కస్టమర్‌‌ ఖాతా వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ మూడోవ్యక్తికి తెలియవు. అయినప్పటికీ కార్డుల పిన్‌‌నంబర్లు, ఓటీపీలను టైప్‌‌ చేయకూడదు.  ఫోన్‌‌ పోతే అలాంటి వివరాలు మోసగాళ్లకు చిక్కవచ్చు.

ఫోన్‌‌ పోతే ఏం చేయాలి ?

ఫోన్‌‌ చోరీ అయినా పొరపాటున ఎక్కడైనా పోయినా Lost/Stolen: Please deactivate my account” అని టైప్‌‌ చేసి సపోర్ట్‌‌@వాట్సాప్​​‌‌.కామ్‌‌కు ఈ–మెయిల్‌‌ చేయాలి. దీనివల్ల వాట్సాప్​​‌‌ ఖాతా డీయాక్టివేట్‌‌ అవుతుంది. ఈ–మెయిల్‌‌లో వాట్సాప్​​ మొబైల్‌‌ నంబరును కూడా పేర్కొనాలి. వాట్సాప్​​‌‌ బ్యాంకు సేవలను డియాక్టివేట్‌‌ చేయాలనుకుంటే, కొత్త సిమ్‌‌కార్డు వచ్చాక తిరిగి వాట్సాప్​​‌‌ అకౌంట్‌‌ను యాక్టివేట్‌‌ చేసుకోవాలి. దానిని వేరే మొబైల్‌‌ వేసే తిరిగి వాట్సాప్​​‌‌ బ్యాంకింగ్‌‌ సేవలకు రిక్వెస్ట్‌‌ చేయాలి. దీనివల్ల పోయిన ఫోన్‌‌లో సేవలు డీయాక్టివేట్‌‌ అవుతాయి.

ఏయే సేవలు పొందవచ్చు ?

వాట్సాప్​​‌‌ బ్యాంకింగ్‌‌ సర్వీసులకు సబ్‌‌స్క్రైబ్‌‌ అయ్యాక బ్యాంకు నుంచి అలెర్ట్‌‌ మెసేజ్‌‌లు/నోటిఫికేషన్లు వస్తాయి. చాటింగ్‌‌ ద్వారానే క్రెడిట్‌‌, డెబిట్‌‌కార్డులు, ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్ల సమాచారం తెలుసుకోవచ్చు. మినీ–స్టేట్‌‌మెంట్‌‌ పొందవచ్చు. ప్రీ–అప్రూవ్డ్‌‌ లోన్‌‌ గురించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఖాతాలోని మొత్తం గురించి తెలుసుకోవాలనుకుంటే ‘ఔట్‌‌స్టాండింగ్ బ్యాలన్స్’ అని టైప్‌‌ చేయాలి. క్రెడిట్‌‌కార్డ్‌‌ రివార్డు పాయింట్ల వివరాలు కావాలంటే ‘‘క్రెడిట్‌‌కార్డ్‌‌ ఔట్‌‌స్టాండింగ్‌‌’’ లేదా ‘‘క్రెడిట్‌‌కార్డ్‌‌ రివార్డ్‌‌ పాయింట్స్’’ అని మెసేజ్‌‌ పంపాలి. ఎఫ్‌‌డీ సమాచారం కావాలంటే ‘‘షో మై ఎఫ్‌‌డీ సమ్మరీ’’ అని మెసేజ్‌‌ పంపాలి. బదులుగా ఎఫ్‌‌డీలోని మొత్తం, వడ్డీరేటు, మెచ్యూరిటీ రేటు తదితర సమాచారం ప్రత్యక్షమవుతుంది. ఈ సమాచారం అంతా ఉచితంగానే ఇస్తారు. ఇలా చేయడం వల్ల బ్యాంకుల బ్రాంచ్‌‌లపై పనిభారం తగ్గుతుంది. వాట్సాప్​​‌‌ ద్వారా ఎంత సమాచారమైనా కోరవచ్చు కానీ లావాదేవీలు చేయడం మాత్రం సాధ్యం కాదు.