మెదక్, వెలుగు: మెదక్ మండలం అల్లాదుర్గం(ప్రాచీన నామం శ్రీవర్ధనకోట)లో 1967లో జరిగిన తవ్వకాలలో వెలుగు చూసిన వెయ్యేళ్ల నాటి అరుదైన కుడ్య చిత్రాలు ప్రస్తుతం హైదరాబాద్ లోని రాష్ట్ర పురావస్తు మ్యూజియంలో భద్రపరచి ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బుర్ర సంతోష్ తెలిపారు. చెరువు ఎదురుగా ఉన్న దిబ్బలలో బయటపడిన చిన్న చాళుక్య కాలం నాటి దేవాలయం గోడలపై ఈ చిత్రాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రాలలో లకులీశుడు(శైవాగమ గురువు), ఉమా మహేశ్వరుడు, మహేశ్వరుడు ప్రధానంగా కనిపిస్తారని చెప్పారు.
శాసనాల ఆధారాల ప్రకారం ఇవి పశ్చిమ చాళుక్యుల కాలానికి చెందినవిగా, క్రీ.శ 11వ శతాబ్దం మధ్యకాలానికి చెందినవిగా పురావస్తు నిపుణులు నిర్ధారించారని తెలిపారు. తవ్వకాలలో చిన్న మట్టి పాత్రలు, చిలుములు, బూడిద అవశేషాలు, ఎరుపు రంగు కుండ పెంకులు లభించాయని చెప్పారు. భారతీయ కుడ్య చిత్ర కళా చరిత్రలో ఎల్లోరా ఫ్రెస్కోల తర్వాత అల్లాదుర్గం చిత్రాల ఆవిష్కరణ ఒక విశిష్ట ఘట్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. అల్లాదుర్గం ఒకప్పుడు శ్రీవర్ధనకోటగా ప్రసిద్ధి చెంది, చాళుక్యుల ముఖ్య కేంద్రంగా ఉండేదని అక్కడ లభించిన శాసనాలు తెలియజేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ చారిత్రక సంపదను భావితరాలకు పరిచయం చేసి సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
