జ్ఞానవాపి మసీదు సెల్లార్​లో..పూజలు చేసుకోవచ్చు : అలహాబాద్​ హైకోర్టు

జ్ఞానవాపి మసీదు సెల్లార్​లో..పూజలు చేసుకోవచ్చు : అలహాబాద్​ హైకోర్టు

ప్రయాగ్​రాజ్: ఉత్తరప్రదేశ్​లోని జ్ఞానవాపి మసీదు సెల్లార్​లో హిందువులు పూజలు చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు కూడా సోమవారం స్పష్టంచేసింది. వారణాసి జిల్లా కోర్టు తీర్పును సమర్థించింది. సెల్లార్ లో పూజలు చేయడానికి అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ మసీదు మేనేజ్​మెంట్ కమిటీ వేసిన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న మసీదులోని ‘వ్యాస్ కా తేఖానా’ లో పూజలు కొనసాగుతాయని హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ స్పష్టంచేశారు. ‘‘ఈ కేసుకు సంబంధించిన మొత్తం రికార్డులను పరిశీలించాం. ఇరు పక్షాల వాదనలు కూడా విన్నాం. జనవరి 17న వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు సరైందే. ఈ తీర్పులో మేము జోక్యం చేసుకునే కారణం ఏమీ కనిపించడం లేదు. వ్యాస్ కా తేఖానాలో హిందువులకు పూజలు చేసేందుకు అనుమతిస్తూ జనవరి 31న జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది’’ అని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ స్పష్టం చేశారు.

జనవరి 17 నాటి ఆర్డర్ కాపీలోనే ఉంది

తాము అప్పీల్ చేసేందుకు అవకాశం ఇవ్వకుండానే వారణాసి జిల్లా కోర్టు జనవరి 31న పూజలు చేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసిందన్న మసీదు కమిటీ వాదనలను అలహాబాద్ హైకోర్టు తప్పుబట్టింది. ‘‘జనవరి 17 నాటి ఆర్డర్ కాపీలోనే ప్రార్థనకు అనుమతిస్తున్నట్టు స్పష్టంగా జిల్లా కోర్టు పేర్కొంది. ఆ తర్వాత సెక్షన్ 151/152 సీపీసీ ప్రకారం ఆర్డర్ ను సవరించి జనవరి 31న తుది తీర్పు వెల్లడించింది’’ అని జస్టిస్ అగర్వాల్ స్పష్టం చేశారు. 54 పేజీల జడ్జిమెంట్​లో హైకోర్టు కీలక విషయాలు వెల్లడించింది. 2024 జనవరి 31న జిల్లా కోర్టు జడ్జి తన లాస్ట్ వర్కింగ్ డే రోజున ఈ తీర్పు వెల్లడించారని అగర్వాల్ గుర్తుచేశారు. ఆ ఉత్తర్వు ప్రతిష్ట కించపర్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 

వ్యాస్ కా తేఖానాలో ఇప్పటికే పూజలు ప్రారంభం అయ్యాయని వివరించారు. రోజూ పూజలు జరుగుతున్నప్పుడు.. వాటిని ఆపే అవకాశం లేదని తేల్చి చెప్పారు. తమ అడ్వకేట్లు వారణాసి జిల్లా కోర్టు తీర్పును స్టడీ చేస్తున్నారని, దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జ్ఞానవాపి వ్యవహారాలు చూసుకునే అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ జాయింట్ సెక్రటరీ మహ్మద్ యాసిన్ స్పష్టం చేశారు.