
స్టార్ హీరో సినిమా విడుదలవుతుంటే చాలు అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. థియేటర్ల ముందు భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, పూలదండలు, డప్పులు, బాణాసంచాలు కాల్చడం వంటి అభిమానుల సందడి దృశ్యాలు గుర్తుకొస్తాయి. వీటన్నిటికీ మూలం తెల్లవారుజామున 1 గంట, 4 గంటలకే ప్రారంభమయ్యే ఎర్లీ మార్నింగ్ షోలు. ఒకప్పుడు తమిళనాట ఈ షోలు పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చేవి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్కృతి దాదాపు కనుమరుగైపోయింది. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ప్రభుత్వం ఎందుకు కఠిన నిర్ణయం తీసుకుందో చూద్దాం..
ప్రీమియర్ షోల సంస్కృతి
రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్ల సినిమాలతో 1990లలో ఈ ప్రీమియర్ షోల సంస్కృతి తమిళనాడులో ప్రారంభమైంది. తమ అభిమాన నటుడి సినిమాను అందరికంటే ముందు చూడాలనే ఉత్సాహంతో అభిమానులు తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద గుమిగూడేవారు. ఈ షోలు స్టార్ హీరోల ప్రాభవాన్ని చాటి చెప్పేవిగా ఉండేవి. విజయ్, అజిత్ వంటి నటుల సినిమాలతో ఈ ట్రెండ్ మరింత పెరిగిపోయింది. ఈ షోల సమయంలో థియేటర్ల యజమానులు, పంపిణీదారులు టిక్కెట్లను భారీ ధరలకు అమ్మి లాభాలు ఆర్జించేవారు.
ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు
ఎర్లీ మార్నింగ్ షోలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడానికి ప్రధాన కారణాలు భద్రతా సమస్యలు. అభిమానులు తమ ఉత్సాహంలో కటౌట్లపై ఎక్కి పాలాభిషేకాలు చేసేటప్పుడు కిందపడిపోవడం, భారీ డ్యాన్స్‌లు చేసేటప్పుడు తొక్కిసలాటలు జరగడం వంటి ప్రమాదాలు తరచుగా సంభవించేవి. ముఖ్యంగా, 2023లో అజిత్ నటించిన 'తునివు' సినిమా విడుదల సందర్భంగా ఒక అభిమాని లారీ కటౌట్ ఎక్కబోయి కిందపడి మరణించడం ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. ఇదే రోజు విజయ్ నటించిన 'వరిసు' మూవీ కూడా విడుదలైంది.
ఉదయం 9 గంటల నుంచే షో..
ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమా విడుదల కావాడంతో అభిమానుల మధ్య ఘర్షణులు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం ప్రీమియర్ షోలపై కఠిన నిర్ణయం తీసుకుంది. థియేటర్లలో ఉదయం 9 గంటల నుండి అర్ధరాత్రి 1:30 గంటల మధ్య మాత్రమే షోలు ప్రదర్శించాలని నిబంధన పెట్టింది. కానీ, ఎర్లీ మార్నింగ్ షోలు ఈ నిబంధనలను ఉల్లంఘించేవి. కొన్ని థియేటర్లు ఈ షోల టిక్కెట్లను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయించేవారు. దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది.
►ALSO READ | Coolie Movie: రజనీకాంత్ 'కూలీ' మేనియా.. ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ ధర. 4, 500కి పెంపు!
గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడు ప్రభుత్వం ఎర్లీ మార్నింగ్ షోలపై కఠిన నిఘా ఉంచుతోంది. పోలీసులు థియేటర్ల యజమానులకు ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదు. ఈ నియంత్రణల కారణంగా, ఇప్పుడు తమిళనాడులో పెద్ద సినిమాలకు కూడా ఉదయం 9 గంటల నుంచే షోలు ప్రారంభం అవుతున్నాయి.
అభిమానుల్లో నిరాశ
తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోలు లేకపోవడం అభిమానులు నిరాశ చెందుతున్నారు. తమ అభిమాన హీరో సినిమాను అందరికంటే ముందు చూడాలన్న కోరిక నెరవేరకపోవడంతో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక సరిహద్దు ప్రాంతాల థియేటర్లలో రిలీజ్ అయ్యే ప్రీమియర్ షోలకు వెళ్ళడం మొదలుపెట్టారు తమిళ అభిమానులు.