Yash Dayal: RCB పేసర్‌కు భారీ ఊరట.. అరెస్ట్ చేయొద్దంటూ స్టే ఇచ్చిన హైకోర్టు

Yash Dayal: RCB పేసర్‌కు భారీ ఊరట.. అరెస్ట్ చేయొద్దంటూ స్టే ఇచ్చిన హైకోర్టు

లైంగిక దోపిడీ కేసులో ఉత్తర ప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ కు భారీ ఉపశమనం లభించింది. అలహాబాద్ హైకోర్టు మంగళవారం (జూలై 15) అతని అరెస్టును నిలిపివేసింది. అత‌న్ని అరెస్టు చేయొద్దంటూ అల‌హాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కు అత‌నిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు అని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొంది. ఘజియాబాద్ కు చెందిన ఒక మహిళ తనపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్నాడని.. ఐదు సంవత్సరాలుగా శారీరక సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపించిన తర్వాత దయాల్ పై జూలై 6న BNS సెక్షన్ 69 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

జూన్ 21న ఆమె ముఖ్యమంత్రి ఆన్‌లైన్ ఫిర్యాదుల పోర్టల్ (IGRS) ద్వారా ఈ  ఆర్సీబీ పేసర్ పై ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత, దయాల్ తన అరెస్టును నిలిపివేయాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. తన రిట్ పిటిషన్‌లో, వివాహం సాకుతో ఆ మహిళతో ఎటువంటి శారీరక సంబంధం ఏర్పరచుకోలేదని దయాల్ తన రిట్ పిటిషన్‌లో పేర్కొన్నాడు.

 తన కుటుంబం ఆమెను కోడలిలా చూసుకుందని దయాల్ తెలిపాడు. అదే సమయంలో, క్రికెటర్‌కు ఆమెను మోసం చేయాలనే ఉద్దేశ్యం లేదని.. కాలక్రమేణా ఆ మహిళ వైఖరి మారిందని కూడా ఆ రిట్ లో ప్రస్తావించబడింది. తమ మధ్య పరస్పర స్నేహం ఉందని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆ మహిళతో ఎప్పుడూ సంబంధం పెట్టుకోలేదని యష్ దయాల్ పిటిషన్‌లో తెలిపాడు. 

ఆ మహిళ దయాళ్ తో నాలుగున్నర సంవత్సరాలకు పైగా సంబంధంలో ఉందని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో ఈ ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ వివాహ హామీలతో తనను తప్పుదారి పట్టించడమే కాకుండా.. తనను ఊటీకి తీసుకెళ్లి తన నివాసంలో 15 రోజులు ఉండనిచ్చాడని ఆమె ఆరోపించింది. ఆమె తరచుగా అతని ఇంటికి వెళ్లి అతని కుటుంబంతో సమయం గడిపినట్టు తనను పెళ్లి చేసుకుంటానని యష్ దయాల్ హామీ ఇచ్చాడని ఆమె తెలిపింది. 

యాష్ దయాల్, అతని కుటుంబం వివాహ హామీ ఇవ్వడం ద్వారా ఆమె ఆశలు పెంచుకుంటూనే ఉందని తెలిపింది. అతని వ్యక్తిగత జీవితంలో తాను లోతుగా మునిగిపోయానని కూడా ఆమె అన్నారు. అయితే తాను పెట్టుకున్న ఈ నమ్మకాన్ని వమ్ము చేశాడని.. అదే సమయంలో దయాల్ చాలా మంది మహిళలతో సంబంధం కలిగి ఉన్నాడని ఆ మహిళ చెబుతుంది. ఏప్రిల్ 17, 2025న మరొక మహిళ ఆమెను సంప్రదించి, దయాల్ మోసం చేస్తున్నాడని.. అనేక మంది ఇతర మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నాడని రుజువుగా చెప్పిందని తెలిసింది.

ఆమె ఫిర్యాదు ప్రకారం దయాల్‌కు కనీసం ముగ్గురు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయనే ఆమె అనుమానాలను వ్యక్తం చేసింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ తరపున యష్ దయాల్ 13 వికెట్లు పడగొట్టి జట్టుకు టైటిల్ తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించాడు.