అనాథ శవాలు అమ్ముకునేటోడు.. ఆర్జీ కర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్​పై ఆరోపణలు

అనాథ శవాలు అమ్ముకునేటోడు.. ఆర్జీ కర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్​పై ఆరోపణలు
  • బంగ్లాదేశ్​కు అక్రమంగా మెడిసిన్స్ పంపేటోడు
  • టెండర్లలో 20% కమీషన్
  • సిట్​కు వివరించిన ఆస్పత్రి మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్​

కోల్​కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అవినీతి బాగోతం ఒక్కోటి బయటికి వస్తున్నది. అనాథ శవాలను అమ్ముకునేవాడని సిట్​ విచారణలో తేలింది. హాస్పిటల్​లో వాడి పడేసిన సూదులు, గ్లౌసులు, టేపులు, సెలైన్ బాటిళ్లు, ఖాళీ సీసాలను రీ సైక్లింగ్ చేయించి కోట్లలో డబ్బులు దోచుకునేవాడు. సందీప్ ఘోష్ అవినీతి చిట్టాను గతంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్​గా పని చేసిన అక్తర్ అలీ సిట్ అధికారుల ముందు ఉంచారు.

అలీ ఫిర్యాదు మేరకు ఘోష్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘‘నేను ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్​లో 2023 దాకా పని చేశాను. ఇప్పుడు ముర్షిదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ డిప్యూటీ సూపరింటెండెంట్​గా విధులు నిర్వర్తిస్తున్నాను. హాస్పిటల్​కు సంబంధించిన మెడిసిన్స్​ను సందీప్ ఘోష్ అక్రమంగా బంగ్లాదేశ్​కు పంపేవాడు. ఆయనకు ఇద్దరు బంగ్లాదేశీయులు హెల్ప్ చేసేవారు.

రెండు మూడు రోజులకోసారి హాస్పిటల్​లో 500 నుంచి 600 కిలోల బయో మెడికల్ వేస్టేజ్ జమ అయ్యేది. దాన్ని రీ సైక్లింగ్ చేసి అమ్ముకునేవాడు. ఎన్నో ఇల్లీగల్ పనుల్లో ఆయన హస్తం ఉంది. అప్పట్లోనే ఆయనపై విజిలెన్స్ కమిటీ ఎంక్వైరీ కూడా జరిగింది. కేసు కూడా రిజిస్టర్ అయింది’’అని అక్తర్ అలీ తెలిపారు.

పొద్దున రిపోర్ట్ ఇస్తే.. అదే రోజు ట్రాన్స్​ఫర్

ఘోష్ అవినీతిపై వేసిన విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీ​లో తానూ సభ్యుడిగా ఉన్నట్లు అక్తర్ అలీ తెలిపారు. దోషిగా తేలినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ‘‘ఘోష్ అవినీతిపై రిపోర్టు తయారు చేసి స్టేట్ హెల్త్ డిపార్ట్​మెంట్​కు అందజేశాం. నన్ను అదేరోజు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ నుంచి ట్రాన్స్​ఫర్ చేసేశారు. కమిటీలోని ఇద్దరు సభ్యులను కూడా బదిలీ చేశారు. ఘోష్ నుంచి స్టూడెంట్స్​ను కాపాడుతూ వచ్చాను. కానీ.. చివరికి ఫెయిల్ అయ్యాను’’అని సిట్​కు అక్తర్ అలీ తెలిపారు.

పాస్ చేయించేందుకు స్టూడెంట్ల నుంచి కూడా లంచాలు తీసుకునేవాడని ఆరోపించారు. ‘‘డబ్బుల కోసం కొందరిని కావాలనే ఫెయిల్ చేసేవాడు. హాస్పిటల్ కౌన్సిల్ అనుమతి లేకుండానే టెండర్లు వేసేవాడు. తమ బంధువులకే పెద్ద మొత్తంలో టెండర్లు దక్కేలా చేశాడు. ఏ టెండర్ వేసినా అందులో 20శాతం కమీషన్ డిమాండ్ చేసేవాడు. టెండర్లు కూడా ఎప్పుడూ సుమన్ హజారా, విప్లవ్ సింఘాకు మాత్రమే దక్కేవి.

కమీషన్ తీసుకున్నాకే పనులు మొదలు పెట్టించేవాడు’’అని అక్తర్ అలీ వివరించారు. టెండర్లలో ఎక్కువ కంపెనీలు పాల్గొనకుండా హజారా, విప్లవ్ కుమార్ అడ్డుకునేవారని తెలిపారు. ఘోష్​కు అండగా పెద్ద వ్యక్తులు ఉన్నారని, ఇష్టమొచ్చినట్లు వ్యవహరించినా ఎవరూ అడ్డుకునేది కాదని వివరించారు.

ఈడీ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అవినీతిపై ఈడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆ హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ప్రిన్సిపాల్​గా ఉన్నప్పుడు ఘోష్ భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈమేరకు అక్తర్ అలీ పిటిషన్​ను దాఖలు చేసేందుకు జస్టిస్ రాజర్షి భరద్వాజ్ అనుమతించారు.  2023లో ప్రభుత్వ అధికారులకు ఘోష్ అవినీతిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని అక్తర్ అలీ తన పిటిషన్​లో పేర్కొన్నారు.

జంతర్ మంతర్ వద్ద రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

న్యూఢిల్లీ: కోల్​కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యకు గురైన జూనియర్ డాక్టర్​కు మద్దతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం పెద్ద సంఖ్యలో రెసిడెంట్ డాక్టర్లు ధర్నా నిర్వహించారు. వర్క్ ప్లేస్​లో రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భయపడకుండా సేఫ్​గా విధులు నిర్వర్తించాలంటే రక్షణ ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. దాని కోసమే తాము పోరాడుతున్నామన్నారు.

ధర్నాలో భాగంగా పలువురు రెసిడెంట్ డాక్టర్లు మాట్లాడారు. ‘‘శనివారం కూడా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే మళ్లీ ఆందోళన చేయాల్సి వచ్చింది. జూనియర్ డాక్టర్​ను రేప్ చేసి చంపేసిన నిందితుడిని ఉరి తీయాలి. న్యాయం కోసం రోడ్డెక్కాల్సి వచ్చింది. డాక్టర్లనే కాదు.. ప్రతి మహిళకు రక్షణ కల్పించాలి. ఏ మహిళకు కూడా వర్క్ ప్లేస్​లో సేఫ్టీ లేదు’’అని రెసిడెంట్ డాక్టర్లు తెలిపారు.

బాధిత కుటుంబానికి న్యాయంతో పాటు డాక్టర్లకు రక్షణ కల్పించడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పేదాకా ఉద్యమం ఆపమని తేల్చి చెప్పారు. ఎయిమ్స్, జీటీబీ, లేడీ హార్డింగ్, మౌలానా అజాద్ మెడికల్ కాలేజీ స్టూడెంట్లు ధర్నా చేశారు. కాగా, ఆగస్టు 15 తెల్లవారుజామున ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్​పై దాడిని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్​స్పెక్టర్​పై సస్పెండ్​ చేశారు.

ఆర్జీ కర్ హాస్పిటల్ వద్ద కేంద్ర బలగాలు

ఆర్జీ కర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ వద్దకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి.  ఎయిర్​పోర్టులు, పార్లమెంట్‌‌‌‌‌‌‌‌కు రక్షణగా ఉండే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ వద్ద గస్తీ కాస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీఐజీ ర్యాంకు అధికారి తన టీమ్​తో బుధవారం హాస్పిటల్​కు చేరుకున్నారు. 

సందీప్​కు పాలీగ్రాఫ్ టెస్టు!

మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్​ను ఇప్పటికే పలుమార్లు విచారించిన సీబీఐ అధికారులు.. అతనికి పాలీగ్రాఫ్/లై డిటెక్టర్‌‌‌‌‌‌‌‌ టెస్టు నిర్వహించాలని భావిస్తున్నారు. కలకత్తా హైకోర్టు ఇప్పటికే టెస్టుకు అనుమతి ఇచ్చింది. జూనియర్ డాక్టర్ రేప్, మర్డర్​ను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు హాస్పిటల్ సిబ్బంది ప్రయత్నించినట్లు సీబీఐ అనుమానిస్తున్నది. ఈ ఘటన తర్వాత ఘోష్​ను విచారిస్తున్నప్పుడు ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. కొన్ని కీలక విషయాలు దాస్తున్నట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.