అచ్చంపేట, వెలుగు : అక్రమ టోల్ ట్యాక్స్ వసూళ్లను అడ్డుకున్నందుకే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శనివారం అచ్చంపేట క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుందుభి వాగు నుంచి ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ఇసుక టిప్పర్ల నుంచి జాజాల సర్పంచ్ భర్త అక్రమంగా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుండగా అడ్డుకున్నందుకే, ఉద్దేశపూర్వకంగా సర్పంచ్ కాశమ్మ తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
నియోజకవర్గంలో ఎక్కడా అక్రమ ఇసుక రవాణాను ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని, కేవలం ‘మన ఇసుక – మన వాహనం’ విధానం ప్రకారమే రవాణా జరుగుతోందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక రవాణా వివాదాలు, నేరెళ్ల ఘటనలో దళితులపై జరిగిన దాడులను ప్రస్తావించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా రాజకీయ విమర్శలు చేయడం ఆయన వైఖరిలోని మార్పుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తూ అన్ని వర్గాలకు, పార్టీల సర్పంచులకు సమాన అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు.
