అమిత్ షా అలా అనడం బీజేపీ దుర్మార్గానికి నిదర్శనం

అమిత్ షా అలా అనడం బీజేపీ దుర్మార్గానికి నిదర్శనం

మునుగోడు ఎన్నికల వరకే టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో సీపీఎం నియోజకవర్గ విసృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... మునుగోడులో బీజేపీ గెలిస్తే నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చుతానని అమిత్ షా అనడం బీజేపీ దుర్మార్గానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీజేపీ మతాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.  

మునుగోడులో అన్ని సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించామని తమ్మినేని వీరభద్రం అన్నారు. టీఆర్ఎస్ తో సభలలో పాల్గొనటం కాకుండా గ్రామస్థాయిలో ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ తో ప్రచారం  చేస్తామని తెలిపారు. తెలంగాణా సాయుధ పోరాటం, తెలంగాణ వారోత్సవాలు, వార్షికోత్సవాలు చేసే హక్కు బీజేపీకి లేదన్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఎన్నికల వరకే టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందన్న తమ్మినేని... జనరల్ ఎన్నికల్లో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.