‘‘ఒక సినీ నిర్మాతగా కోట్లు సంపాదించాను. కానీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమా ద్వారా డబ్బు కంటే సంతృప్తిని ఎక్కువ సంపాదించుకున్నా” అన్నారు అల్లు అరవింద్. ఆయన సమర్పణలో రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈనెల 7న సినిమా విడుదల. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘మనకు తెలిసినప్పటికీ చెప్పలేని కొన్ని నిజాలను సినిమా ద్వారా చూపించొచ్చు అని ఈ కథ విన్నప్పుడు అనిపించింది. ఎన్ని పాటలు, ఎంత వినోదం అని కాకుండా... మన అక్క, చెల్లి, పిన్ని మనసుల్లో ఏముంటుంది.. వాళ్లకు ఎలాంటి కోర్కెలు ఉంటాయి అనుకుని ఈ చిత్రం చూడాలి.
ఇది చూశాక చాలామంది ఆ రాత్రి నిద్రపోరు. అంతగా వెంబడిస్తుంది. ప్రతి ఫ్యామిలీలో ప్రతి పర్సన్ ఈ కథతో రిలేట్ అవుతారు. రేటింగ్ ఇవ్వడానికి క్రిటిక్స్ ఇబ్బందిపడతారు” అని చెప్పారు. నిర్మాత విద్య కొప్పినీడి మాట్లాడుతూ ‘ఎన్నో విలువలు ఉన్న సినిమా ఇది. మనం జీవితంలో కొన్ని ఎక్సిపీరియన్స్ చేస్తే గానీ చెప్పలేం. మనలో ఎన్నో ఫీలింగ్స్ ఉన్నా మాటల్లో వాటిని వివరించలేం.
అలాగే మనం అడగలేని ప్రశ్నలు కూడా ఉంటాయి. వాటన్నింటికీ సమాధానమే ఈ సినిమా’ అని అన్నారు. రాహుల్ రవీంద్రన్ సొంతింటి కలను త్వరలో నెరవేర్చబోతున్నట్టు నిర్మాత ధీరజ్ మొగిలినేని చెప్పారు. హీరో దీక్షిత్ శెట్టి, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రశాంత్ విహారి, హేషమ్ అబ్దుల్ వాహాబ్ పాల్గొన్నారు.
