
హీరో అంటే.. మంచివాడై ఉండాలి. చెడ్డపనులు చేసే విలన్స్‌ను చితకబాది సమాజానికి మంచి చేయాలి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు హీరోయిజం మారింది. హీరోలోనూ ఓ విలన్ ఉంటున్నాడు. పాజిటివ్, నెగిటివ్ రెండూ తనలోనే ఉంటున్నాయి. అలాంటి హీరోయిజమే ఇప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తోంది... బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది.
నెగిటివ్ రోల్.. తగ్గేదేలే
‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ‘పుష్పరాజ్’ పాత్రతో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాడు అల్లు అర్జున్. అవార్డుల్లోనూ ‘తగ్గేదేలే’ అంటూ ఇటీవల ఆ పాత్రతో బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఓ కూలీగా మొదలైన పుష్పరాజ్.. ఎర్రచందనం సిండికేట్‌కి ఛైర్మన్‌గా ఎదిగిన క్రమం తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. దీంతో పాన్ ఇండియా రేంజ్‌లో మెప్పించింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది. ఇలాంటి కథతోనే సెవెంటీస్‌లో ‘డాన్’ సినిమా వచ్చి బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అదే కథ పలుమార్లు రీమేక్ అయింది. ఆ రీమేక్‌లో ‘బిల్లా’గా స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఇంప్రెస్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు ‘సాలార్’లోనూ మాఫియా కింగ్‌గా కనిపించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. తను తీసిన ‘కేజీఎఫ్’ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, యశ్‌ను ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్‌ను చేసింది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు రాగా, మూడో సినిమా కూడా తెరకెక్కే అవకాశాలున్నాయి. ఇక టెంపర్, జై లవకుశ చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేసిన ఎన్టీఆర్.. ‘దేవర’లో నెగటివ్ షేడ్స్ ఉండే పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నాడు. అలాగే హృతిక్ రోషన్ హీరోగా నటించనున్న ‘వార్ 2’లో స్టైలిష్ విలనిజం చూపించ బోతున్నాడు.
విలన్‌లో దాగున్న హీరో
ఇటీవల విడుదలైన ‘కింగ్ ఆఫ్ కోథా’లోనూ దుల్కర్ సల్మాన్ నెగిటివ్ రోల్‌లోనే కనిపించాడు. ‘గాడ్‌ఫాదర్’లో చీకటి సామ్రాజ్యానికి నాయకుడిగా కనిపించిన చిరంజీవి, ఇటీవల వచ్చిన ‘భోళా శంకర్’ ప్లాష్ బ్యాక్ సీన్స్‌లో రౌడీషీటర్‌గా కనిపించారు. మిస్టర్ కెకె, మహాన్, కోబ్రా చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు విక్రమ్. అంతర్జాతీయ స్థాయిలో మెప్పించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని రామ్ చరణ్ పాత్ర ప్రారంభంలో కొంత నెగిటివ్ షేడ్స్ కనిపిస్తాయి. బిజినెస్‌మేన్, అతడు, సర్కారు వారి పాట చిత్రాల్లో మహేష్ బాబు, ‘బింబిసార’లో కళ్యాణ్ రామ్, ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్, ‘అర్జున్ రెడ్డి’లో విజయ్, ‘వి’లో నాని, నేనే రాజు నేనే మంత్రి, భీమ్లా నాయక్ చిత్రాల్లో రానా, ‘విక్రమ్’లో సూర్య ఇలాంటి నెగిటివ్ టచ్ ఉండే క్యారెక్టర్స్ పోషించినా అందులోని హీరోయిజం ప్రేక్షకులకు నచ్చింది. ‘మనీ హయిస్ట్’ లాంటి పాపులర్ స్పానిష్ సిరీస్ మొదలు.. ఇటీవల హిందీలో వచ్చిన ‘గన్స్ అండ్ గులాబ్స్’ వరకూ వెబ్ సిరీస్‌లో ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్స్‌తో వచ్చినవే ఎక్కువ. ఓటీటీ ప్రేక్షకులను ఎక్కువగా ఎంగేజ్ చేస్తున్న సిరీస్‌లు కూడా అవే కావడం విశేషం.
ఎలివేషన్స్ ఎక్కువ
స్మగ్లర్, దొంగ, మాఫియా డాన్, గ్యాంగ్‌స్టర్.. వీళ్లెవరిలోనైనా మనకు విలనే కనిపిస్తాడు. కానీ సినిమాల్లో మాత్రం ఆ క్యారెక్టర్స్‌ను మాత్రమే చూస్తున్నారు ప్రేక్షకులు. హీరో పాత్ర తన స్వార్థం కోసం ఎంతమందిని కొట్టినా జేజేలు కొడుతున్నారు. అదొక సినిమా, తనొక హీరో అని మాత్రమే చూస్తున్నారు. హీరో అంటే ఇలాగే ఉండాలి అనే మూస క్యారెక్టరైజేషన్‌ను ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. అందుకు తగ్గట్టే.. హీరో అంటే మంచివాడే కావల్సిన అవసరం లేదని, తనలోనూ లోపాలు ఉంటాయని ఫిల్మ్ మేకర్స్ చూపిస్తున్నారు. నెగిటివ్ రోల్స్ చేస్తున్నప్పటికీ హీరోలపై చూపించే అడ్మిరేషన్‌లో ఎలాంటి మార్పు లేదు. వాళ్ల దృష్టిలో హీరో అంటే ఎప్పటికీ హీరోనే. అది పాజిటివ్ రోల్ చేసినా, నెగిటివ్ రోల్ చేసినా. పైగా హీరోయిజం చూపించే ఎలివేషన్ సీన్స్ కూడా ఇలాంటి చిత్రాల్లో ఎక్కువ ఉంటున్నాయి. అందుకే ఈ తరహా పాత్రలు పోషించడానికి హీరోలు, వాటిని చూడటానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
రిస్క్ అయినప్పటికీ..
ఒకప్పటి హీరో పాత్ర అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. కచ్చితంగా వాటికి లోబడి నటించాలి. కానీ నెగిటివ్ టచ్ ఉండే హీరో క్యారెక్టర్ అలా కాదు. ఎలాంటి బౌండరీస్ లేకుండా తమ నట విశ్వరూపం చూపించొచ్చు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ ఎదురైనా ఆ క్యారెక్టర్స్ మాత్రం వాళ్లలోని నటుడిని ఆవిష్కరిస్తున్నాయి. అందుకే హీరోలు ఇలాంటి పాత్రల్లో నటించాలని తపన పడుతున్నారు. అయితే ఆ పాత్రల కోసం మేకోవర్ అవడం అంత సులభమేమీ కాదు. కండలు పెంచి తమ బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడం మొదలు, డైలాగ్ డిక్షన్ వరకూ ప్రతీ విషయంలో ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. ఫిల్మ్ మేకర్స్‌కు కూడా ఇది కత్తి మీద సాము లాంటిదే. ఏమాత్రం అటు ఇటైనా సినిమా డిజాస్టర్ అవడం ఖాయం. ఈ తరహాలో వచ్చిన చిత్రాల్లో కేజీఎఫ్, పుష్ప లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే.. భోళా శంకర్, రావణాసుర, కబ్జా లాంటి చిత్రాలు నిరాశ పరిచాయి.
బ్యాలెన్స్ చేస్తేనే..
హీరోలు ఎంత దుష్టులైనా ప్లాష్ బ్యాక్‌లో వాళ్లు అలా అవడానికి తగ్గ పరిస్థితులను సరిగ్గా చూపించగలగాలి. హీరోకి అంటూ ఓ మంచి ఉద్దేశం ఉండి అందుకోసం తప్పుడు దారిలో వెళ్లడం ఒక రకం. ఫస్ట్ హాఫ్‌లో తప్పులు చేసినా, సెకండాఫ్‌లో తప్పు తెలుసుకుని మంచివాడిగా మారడం మరో రకం. ప్రేమ కోసం ఒకరు, పర్సనల్ రివెంజ్ కోసం మరొకరు, జీవితంలో ఎదగాలని ఇంకొకరు ఇలా కారణమేదైనా ప్రేక్షకులకు దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పగలిగితే చాలు. నెగిటివ్ క్యారెక్టర్స్‌ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఇప్పటికే ఎన్నో చిత్రాలు నిరూపించాయి. ఇక జానపదాలు, ఇతిహాసాలు, రియల్ లైఫ్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కించే దుష్ట పాత్రల విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ జనాలకు తెలిసిన విషయాలు కనుక బ్యాలెన్సింగ్‌గా ఆ విలనిజాన్ని ఎలివేట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒకప్పుడు రావణుడి పాత్రతో సీనియర్ ఎన్టీఆర్ ఎంతలా మెప్పించారో తెలిసిందే. ఇటీవల ‘ఆదిపురుష్’లో సైఫ్ అలీఖాన్ అదే పాత్ర పోషించగా నేషనల్ వైడ్‌గా ట్రోలింగ్ జరిగింది.
ఒకప్పుడు విలన్‌గా కెరీర్ ప్రారంభించి హీరోలు అయిన వారెందరో. ఇప్పుడు హీరోలుగా నటిస్తూనే మరో హీరో సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ‘బాహుబలి’లో రానా, ‘రోబో 2.ఓ’లో అక్షయ్ కుమార్, ‘ఆదిపురుష్’లో సైఫ్ అలీఖాన్, ‘విక్రమ్’లో విజయ్ సేతుపతి, గ్యాంగ్ లీడర్, వలీమై చిత్రాల్లో కార్తికేయ, ‘బాగీ’లో సుధీర్ బాబు, సరైనోడు, వారియర్ చిత్రాల్లో ఆది పినిశెట్టి, ‘సవ్యసాచి’లో మాధవన్ ఇలా విలన్ రోల్స్ చేసి నటులుగా తామేంటో ప్రూవ్ చేసుకున్నారు. అయితే కేవలం విలన్‌గా నటించడం వేరు, హీరోగా నటిస్తూనే నెగిటివ్ రోల్ చేయడం వేరు. ఆ క్యారెక్టర్‌కు న్యాయం చేస్తూనే తమపై ఆ పాత్ర ప్రభావం పడకుండా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది.
బాలు, పంజా లాంటి గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌లో నటించిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్‌లో ‘ఓజీ’ అనే ఫుల్ లెంగ్త్ గ్యాంగ్‌స్టర్ మూవీలో నటిస్తున్నాడు. మరోవైపు ‘హరిహర వీరమల్లు’ చిత్రంలోనూ బందిపోటు దొంగగా నటిస్తున్నాడు. ఇటీవల ‘రావణాసుర’లో నెగిటివ్ రోల్‌లో కనిపించిన రవితేజ.. స్టువర్ట్‌పురం దొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’గా నటిస్తున్నాడు. ‘గద్దలకొండ గణేష్’ లాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న మాస్ క్యారెక్టర్‌తో మెప్పించిన వరుణ్ తేజ్.. రాబోయే ‘మట్కా’ చిత్రంలో మరోసారి ఆ తరహా పాత్ర చేయబోతున్నాడు.