‘ది సౌత్ స్వాగ్'.. ఇండియా టుడే కవర్ పేజీపై ఐకాన్ స్టార్

‘ది సౌత్ స్వాగ్'.. ఇండియా టుడే కవర్ పేజీపై ఐకాన్ స్టార్

ఎప్పుడు ఏ హీరో స్టార్ హీరోగా మారతారో, ఏ సినిమా హిట్ అవుతుందో ఒక్కోసారి ముందే ఊహించడం చాలా కష్టం. ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఏలుతున్న వారూ లేకపోలేదు. అదే తరహాలో ఇప్పుడు మరొక వచ్చి చేరారు. ఇంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత క్రేజ్ ఉన్నా.. ఈ హీరోకు ఈ సినిమాకు వచ్చినంత క్రేజ్ మరే సినిమాకూ రాలేదు. అదే పుష్ప ది రైజ్. అత్యంత పాపులారిటీ సొంతం చేసుకున్న ఆ హీరోనే ఐకాన్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మరొక ఘనత సాధించారు. ఏకంగా ఇండియా టుడే కవర్ పేజీపై తళుక్కుమన్నారు. దానికి కారణం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమానే అని ఆయన ఫ్యాన్స్ బల్లగుద్ది చెప్తున్నారు.

అది కేవలం ఫ్యాన్స్ చెప్పారనే కాదు... ఆ సినిమాలోని డైలాగులు, సాంగ్స్ కు వచ్చిన పాపులారిటీ గురించి తెలిసిన వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. తగ్గేదే లే.. అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ ఇప్పటికీ నెట్టింట్లో ఏదో ఒక చోట చక్కర్లు కొడుతూనే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన  ఈ మూవీకి, అందులో బన్నీ స్టైల్, యాక్టింగ్, మ్యానరిజానికి చాలా మంది ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ‘సీక్రెట్ బిహైండ్ క్రాస్ ఓవర్ సక్సెస్ ఆఫ్ సదరన్ ఫిలింస్ అండ్ దెయిర్ లీడింగ్ యాక్టర్స్’ అంటూ ఇండియా టుడే ఆంగ్లంలో పెద్ద కథనాన్ని ప్రచురించింది. కవర్ పేజీ మీద ‘ది సౌత్ స్వాగ్’ అని అల్లు అర్జున్ ఫొటోను జోడించి అందర్నీ ఆకట్టుకుంటోంది. సౌత్ ఇండియాలో ఎంతో మంది స్టార్స్ ఉండగా.. ఆ ఘనత కేవలం ఒక్క అల్లు అర్జున్ కే దక్కడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక్కడ మరో విషయమేమిటంటే.. ఇండియా టుడే ప్రచురించిన కవర్ పేజీపై ఉన్న అల్లు అర్జున్ ఫొటో కూడా తగ్గేదే లే అనే సిగ్నేచర్ స్టైలింగ్‌తోనే ఉండడం గమనించొచ్చు.