ఆలోచన: ఖతార్ నాక్

ఆలోచన: ఖతార్ నాక్

ఈ ఏడాది మిగిల్చిన అద్భుతమైన అనుభూతుల్లో ఫిఫా వరల్డ్ కప్ కూడా ఒకటి. కిందటి ఆదివారం జరిగిన ఫైనల్‌‌‌‌లో ఏండ్ల తరబడి వెయిటింగ్‌‌‌‌కు తెరదించుతూ మెస్సీ టీమ్ గ్రాండ్ సక్సెస్‌‌‌‌ అందుకుంది. ఏదైతేనేం.. ఫుట్‌‌‌‌బాల్ ఫీవర్ ముగిసింది. అయితే దీనికోసం వేల కోట్లు ఖర్చు, భారీ ఏర్పాట్లు, కొత్త ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులు, స్టేడియాలు.. ఇలా ఒకటేమిటి!  నెల రోజుల పాటు ప్రపంచమంతా తన‌‌‌‌వైపే చూసేలా చేసింది ఖతార్‌‌‌‌. 

‘మరి ఇంత హంగామా కేవలం ఫుట్‌‌‌‌బాల్ కోసమేనా?’ అంటే.. కాదనే చెప్పాలి. వరల్డ్ కప్ సక్సెస్ చేయడం వెనుక ఖతార్ దేశానికి ఓ మోటో ఉంది. మరి అది నెరవేరిందా? ఫుట్‌‌‌‌బాల్ కప్.. ఖతార్ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ను ఎలా మారుస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ప్రపంచకప్‌‌‌‌‌‌‌‌ సంబరం ముగిసి,  ఖతార్ వీధులు, హోటళ్లు ఖాళీ అయిపోయాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్​ల్లో రష్ తగ్గింది. కొత్తగా కట్టిన స్టేడియాలను కొన్నిరోజుల్లో కూల్చేయడమో లేదా వేరే పనులకు వాడడమో చేస్తారు. ఫిఫా నిర్వాహకులు2026లో జరిగే తర్వాతి వరల్డ్ కప్ పనుల్లో మునిగిపోతారు. ఫిఫా కోసం ఖతార్ పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంతో పాటు కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంది. ఫిఫా హోస్టింగ్ హక్కులను పట్టుబట్టి మరీ హోస్టింగ్ హక్కులు దక్కించుకుంది. ఇంత చేసినందుకు ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే లాభమేంటి? అన్న డౌట్ చాలామందికి వస్తుంది. అది తెలియాలంటే ముందు ఫిఫా గురించి తెలుసుకోవాలి. 

ఎన్జీఓగా మొదలై..

ఫిఫా అంటే ‘ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దె ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ అసోసియేషన్’. అంటే అంతర్జాతీయ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ సంఘాల సమాఖ్య. ఇది 1904లో ఏర్పాటైన సాధారణ ఎన్జీఓ. అప్పట్లో ఒలింపిక్స్ తప్ప మరే ఇతర ఇంటర్నేషనల్ గేమ్స్ ఉండేవి కావు. దేశాల మధ్య ఆటలపోటీలకు మంచి డిమాండ్ ఉండడం చూసి ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ ఆటను ఒలింపిక్స్ తరహాలో నిర్వహించాలనుకున్నారు ఫిఫా నిర్వాహకులు. అలా బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాలు కలిసి ‘ఫిఫా’ పేరుతో ఎన్జీఓ మొదలుపెట్టాయి.  

ఫిఫా–1998 వరకు ఓ సాధారణ క్రీడా సంస్థగా ఉండేది. టోర్నీలు నిర్వహించాలంటే అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడలా కాదు. వేలమంది ఉద్యోగులు, వందల కోట్ల  ఆదాయం. దీనికి కారణం ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌కు వరల్డ్ వైడ్‌‌‌‌‌‌‌‌గా క్రేజ్ రావడం. ఫిఫా సంస్థ ప్రతి దేశాన్ని కలుపుకుంటూ, మార్కెటింగ్ టెక్నిక్స్‌‌‌‌‌‌‌‌తో ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ కప్‌‌‌‌‌‌‌‌ను పాపులర్ టోర్నీగా చేసింది. ఏండ్లపాటు కష్టపడి శక్తివంతమైన క్రీడా సంస్థగా ఎదిగింది.  ఫిఫా నిర్వహించిన వరుస టోర్నీల వల్ల ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ప్రపంచకప్‌‌‌‌‌‌‌‌ పాపులారిటీ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. 

ఖతార్ కథ ఇది

‘ప్రపంచ కప్ ఏ దేశంలో జరపాలి?’ అనే విషయం నిర్ణయించడానికి ఫిఫా వేలం నిర్వహిస్తుంది. వేలంలో పాల్గొనే దేశాలు టోర్నీని జరిపేందుకు కావాల్సిన స్టేడియాల వివరాలు, వసతులు, సదుపాయాలఉ ఎలా ఏర్పాటు చేస్తారనే వివరాలను ఒక ప్లాన్​గా సబ్మిట్ చేస్తాయి. ఇలా దేశాల నుంచి అప్లికేషన్లు తీసుకున్న తర్వాత ఓటింగ్ ఆధారంగా బిడ్ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సెలక్ట్ చేస్తారు. అలా 2010లో జరిగిన బిడ్‌‌‌‌‌‌‌‌లో ఖతార్ ‘2022 ఫిఫా వరల్డ్ కప్’ హక్కులు దక్కించుకుంది. అమెరికా, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలను ఓడించి మరీ ఈ బిడ్‌‌‌‌‌‌‌‌ను సాధించి, ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన తొలి అరబ్ దేశంగా నిలిచింది.

ప్రపంచ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ చరిత్రలో ఇప్పటివరకు పోటీలు నిర్వహించిన ఇతర దేశాలకు, ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య చాలా తేడా ఉంది. ప్రపంచకప్ పోటీల కోసం ఖతార్ ఏకంగా 220 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించింది. ప్రపంచ కప్‌‌‌‌‌‌‌‌ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ టోర్నీ మొదలయ్యాక ఇంత భారీగా ఖర్చు చేసిన దేశం మరొకటి లేదు. ఖతార్ ఒక ఎడారి దేశం. వేడి ఎక్కువగా ఉండే అక్కడి వాతావరణ పరిస్థితులను మేనేజ్ చేయడం కష్టం. దీనికితోడు ఆచారాల పరంగా స్ట్రిక్ట్ రూల్స్ ఉండే రాచరిక దేశం కూడా. అందుకే ప్రపంచ కప్ పోటీలు జరపడానికంటే ముందు నుంచే సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 

ప్రస్తుతం ఖతార్‌‌‌‌‌‌‌‌ జీడీపీ18 వేల కోట్ల డాలర్లు. అయితే అచ్చంగా ఫిఫా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ పోటీల కోసమే ఆ దేశం ఏకంగా 22 వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది. వరల్డ్​ కప్‌‌‌‌‌‌‌‌ హక్కులను దక్కించుకున్న ఏడాది నుంచి తన జీడీపీలో ఏటా పది శాతాన్ని పోటీల ఏర్పాట్ల కోసం ఖర్చు చేస్తూ వచ్చింది. గడచిన 21 ఫిఫా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ పోటీలన్నింటికీ కలిపి అయిన ఖర్చు కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ డబ్బుని ఖతార్ వెచ్చించింది. 

ఖతార్ మోటో ఇదే..

ప్రపంచకప్‌‌‌‌‌‌‌‌ కోసం కనీవినీ ఎరగని రీతిలో ఖర్చు చేయడం వల్ల ఆ చిన్న దేశానికి వచ్చే లాభమేంటి? అని చాలామందికి డౌట్ ఉంటుంది. అసలు విషయం అక్కడే ఉంది. గల్ఫ్ దేశాల్లో యూఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలతో పోటీ పడాలంటే ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా తనదైన గుర్తింపు ఉండాలి. దుబాయ్, సౌదీలాగా ఆయిల్ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు టూరిజం కూడా డెవలప్ అవ్వాలి. కొత్త పెట్టుబడులను ఆకర్షించాలి. ఈ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌లో భాగంగానే  ఫిఫా కప్‌‌‌‌‌‌‌‌ను పట్టుబట్టి మరీ సక్సెస్ చేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఫిఫా ద్వారా ఖతార్ సొంత బ్రాండింగ్ చేసుకుంది. 

ఆటలు, కళలు ఒక దేశం పాపులారిటీని పెంచడానికి ఉపయోగపడ తాయి. సెంట్రల్ ఆసియాలో చిన్న దేశమైన ఖతార్ ఎంతో గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించిన ప్రపంచ కప్ పోటీలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. గల్ఫ్ దేశాలన్నింటిలో వస్తువుల రవాణా కోసం రోడ్లు అత్యంత కీలకం. పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌‌‌‌‌‌‌లు ఈ విషయంలో ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆంక్షలు విధించాయి. అయినా ఖతార్ చెక్కుచెదరకుండా ఈ సవాళ్లని అధిగమించి ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ కప్ పోటీలను నిర్వహించి, ఫుట్​బాల్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. 

ప్రపంచాన్ని ఆకర్షించే క్రమంలో ఖతార్ తన కల్చర్ మూలాలను మరిచిపోలేదు. చమురు సంపదను కనిపెట్టడానికి ముందురోజుల్లో ఎడారులలో అరబ్​ తెగలు కొనసాగించిన జీవన విధానం ప్రతిబింబించేలా స్టేడియాలు కట్టింది. దివ్యాంగుడైన ఘానం అల్ ముఫ్తా అనే యువకుడు పవిత్ర ఖురాన్‌‌‌‌‌‌‌‌ను చదవడం, అమెరికన్ నటుడు మోర్గాన్ ఫ్రీమాన్ దాని అర్థాన్ని తెలుసుకునే సంభాషణతో ఈ పోటీలు మొదలయ్యాయి. 

ఖతార్ ఎలా లాభపడింది?

ఫిఫా ప్రపంచ కప్ జరగడం ద్వారా ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే లాభాలేమీ ఉండవు. కానీ, ఫిఫా ద్వారా ఖతార్ అనే ఒక దేశం ఉన్నట్టు ప్రపంచానికి తెలిసింది. కొన్ని లక్షల మంది ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు చూడడానికి ఖతార్ వెళ్లారు. ఆ దేశం ఆశించింది కూడా ఇదే. నిజానికి నెలరోజులపాటు ప్రపంచ కప్‌‌‌‌‌‌‌‌ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ నిర్వహణకు అయ్యే170 కోట్ల డాలర్ల ఖర్చును ఫిఫానే భరిస్తుంది. టికెట్‌‌‌‌‌‌‌‌ అమ్మకాలు, అంతర్జాతీయ టెలివిజన్‌‌‌‌‌‌‌‌ ప్రసార హక్కుల ద్వారా వచ్చే 470 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఫిఫా తన జేబులో వేసుకుంటుంది. 

ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ పోటీల కోసం ఖతార్‌‌‌‌‌‌‌‌ 650 కోట్ల డాలర్లతో ఎనిమిది స్టేడియాలు నిర్మించింది. కేవలం 28 లక్షల జనాభా గల చిన్న దేశానికి అన్ని మైదానాలు అవసరం లేదు. ఫిఫా పోటీలు ముగిసిన తర్వాత వాటిలో మూడింటిని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌కు కేటాయించి, మిగిలిన వాటిని కూలగొట్టడమో, ఇతర పనులకు ఉపయోగించడమో చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ కోసం ఖతార్‌‌‌‌‌‌‌‌ పెట్టిన ఖర్చులో చాలాభాగం మౌలిక వసతులకే సరిపోయింది. ‘ఖతార్‌‌‌‌‌‌‌‌ జాతీయ విజన్‌‌‌‌‌‌‌‌-2030’లో భాగంగా మెట్రో రైల్వే, కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు, వేల కిలోమీటర్ల కొత్త హైవేలు, వందకుపైగా హోటళ్లను నిర్మించారు. 

ఫిఫా పోటీలు ముగిశాక కూడా ఈ మౌలిక వసతులు అంతర్జాతీయ పెట్టుబడులను, కొత్త పరిశ్రమలను ఖతార్‌‌‌‌‌‌‌‌ వైపు ఆకర్షిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ఏడాది తొలి10 నెలల్లోనే ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 400 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ పోటీల వల్ల ఈ ఏడాది చివరకు ఖతార్ జీడీపీ వృద్ధి రేటు 4.1శాతానికి పెరుగుతుందని అంచనా. ఖతార్‌‌‌‌‌‌‌‌లో గడిచిన నాలుగేళ్లలో స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు బాగా డెవలప్ అయ్యాయి.

ఎంతమంది చూశారు? 

ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్‌‌‌‌‌‌‌‌గా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌కు పేరుంది. ముఖ్యంగా ఫిఫా వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌కు ఆడియెన్స్ భారీ సంఖ్యలో ఉంటారు. ఈ విషయంలో ఒక్క ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే దానితో పోటీ పడగలవు. ఖతార్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్.. ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్  చరిత్రలోనే ఎక్కువమంది స్పెక్టేటర్స్‌ వచ్చిన రికార్డు సాధించింది. 2.45 మిలియన్ల మంది ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ స్టేడియాలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ ఫైనల్స్ కోసం15 లక్షల మంది ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ లవర్స్‌ ఖతార్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. ఒక్క మనదేశంలోనే 32 మిలియన్ల మంది లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఫైనల్ మ్యాచ్ చూశారు. ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ప్రపంచంలో సగం మంది చూసి ఉంటారని ఒక అంచనా. పదమూడు రోజులపాటు జరిగిన 48 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు ప్రతి స్టేడియంలో 96 శాతం ఆక్యుపెన్సీ ఉంది.  

ఫిఫా ఆదాయం ఎలా?

చాలాదేశాల్లో ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ క్రేజ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌లూ, ఆటగాళ్ల వేలాలు.. అబ్బో, ఆ హడావిడి మామూలుగా ఉండదు. ఎక్కువమంది చూసే ఆటగా పేరున్న ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌కు సంపాదన కూడా అదే రేంజ్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ ఆదాయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఎడిషన్స్‌‌‌‌‌‌‌‌ అన్నింటిని కలిపినా కూడా ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో వచ్చే ఆదాయంలో సగం కూడా ఉండదు. అయితే నాలుగేండ్లకోసారి మాత్రమే ఫిఫా తన ఆదాయ వివరాలను వెల్లడిస్తుంది. 

రష్యాలో 2018లో జరిగిన ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో ఫిఫాకు వచ్చిన ఆదాయం 640 కోట్ల డాలర్లు. భారత కరెన్సీలో సుమారుగా రూ.37,500 కోట్లు. ఇప్పుడు ఖతార్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో ప్రైజ్‌‌‌‌‌‌‌‌మనీ కోసమే 44 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. గెలిచిన జట్టుకి  4.4 కోట్ల డాలర్లు ఇస్తారు. మన కరెన్సీలో సుమారు రూ.358 కోట్లు. ఫిఫా సంపాదనలో చాలావరకూ టీవీ హక్కుల అమ్మకం ద్వారానే వస్తుంది.

వివాదాలెన్నో...

గల్ఫ్ దేశమైన ‘ఖతార్’‌‌‌‌‌‌‌‌లో టోర్నీ నిర్వహించాలనే నిర్ణయంపై అనేక విమర్శలు వచ్చాయి. వరల్డ్ కప్ ఫైనల్స్ కోసం కొత్త స్టేడియాలు, హోటళ్లు, హైవేలు వంటివి కట్టారు. వీటి నిర్మాణం కోసం ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌లకు చెందిన 30,000 మంది కార్మికులు పనిచేసినట్లు అంచనా. ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వరల్డ్ కప్ బిడ్ దక్కినప్పటి నుంచి అక్కడ 6,500 మంది కార్మికులు మరణించినట్లు గార్డియన్ పత్రిక 2021, ఫిబ్రవరిలో పేర్కొంది. 

అయితే గార్డియన్ లెక్కలు తప్పు అంటోంది ఖతార్ ప్రభుత్వం. అక్కడ చాలాకాలంగా నివసిస్తున్న విదేశీ కార్మికులను, వరల్డ్ కప్ ప్రాజెక్టుల్లో పాల్గొనని కార్మికులను కూడా గార్డియన్ లెక్కల్లో చెప్పడం వల్ల మరణాల సంఖ్య పెద్దమొత్తంలో కనిపిస్తోందనేది ఆ ప్రభుత్వ వాదన. ఎలాగయితేనేం.. టూరిజం డెవలప్ చేసుకోడానికి, పెట్టుబడులు తెచ్చుకోడానికి ఈ ఫుట్‌బాల్‌ టోర్నీనీ ఖతార్ సక్సెస్‌ఫుల్‌గా వాడుకుంది.