న్యూఢిల్లీ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు బుధవారం దేశవ్యాప్తంగా మరో ఐదు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. యూపీలోని సువార్, చన్ బే.. మేఘాలయలోని సోహియాంగ్..ఒడిశాలోని జార్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పంజాబ్ లోని జలంధర్ లోక్ సభ నియోజకవర్గానికి బైపోల్స్ జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు సువార్, చన్ బేలో వరుసగా 41.78, 39.51 పోలింగ్ శాతం నమోదు కాగా.. సోహియంగ్ లో 91.56 శాతం ఓటింగ్ జరిగింది.
జార్సుగూడలో 68.12, జలంధర్ లో 50.27 పోలింగ్ శాతం రికార్డయ్యింది. యూపీలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కూటమి, సమాజ్ వాదీ పార్టీల మధ్య పోరు కొనసాగుతోంది. ఒడిశాలోని జార్సుగూడలో 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ బీజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీ, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ ఉంది. ఈ ఉపఎన్నికల రిజల్ట్స్ ఈ నెల13న వెలువడనున్నాయి.