లెఫ్ట్​కు కాంగ్రెస్ రెబల్స్ భయం.. గత అనుభవం నేపథ్యంలో ఆందోళన

లెఫ్ట్​కు కాంగ్రెస్  రెబల్స్ భయం.. గత అనుభవం నేపథ్యంలో ఆందోళన

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పొత్తులు ఖరారైనా కమ్యూనిస్టుల్లో మాత్రం రెబల్స్ భయం పట్టుకున్నది. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా తమకు కేటాయించిన సీట్లలో కాంగ్రెస్ నుంచి రెబల్స్ పోటీ చేస్తారనే ప్రచారం మొదలైంది. దీంతో లెఫ్ట్ పార్టీల నేతల్లో అయోమయం నెలకొన్నది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చెరో ఐదు సీట్లు ఇవ్వాలని సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ ను కోరాయి. పలు దఫాలుగా చర్చల తర్వాత చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు.. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లను కేటాయించారు. వీటిలో వైరా, చెన్నూరు సీట్లను ఆయా పార్టీలు అడగలేదు. అయితే, ఆ సీట్లను గెలిపించుకునే బాధ్యత తమదే అంటూ కాంగ్రెస్ నేతలు హామీలిచ్చి లెఫ్ట్ నేతలను ఒప్పించినట్టు తెలుస్తోంది. కానీ, ప్రస్తుతం సీపీఎం, సీపీఐకి ఇచ్చిన స్థానాల్లో కాంగ్రెస్ నుంచి సీటు ఆశించిన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

తాము రెబల్స్ గా పోటీ చేయాలని, కాంగ్రెస్ కేడర్ కూడా తమకే సపోర్ట్ చేస్తుందనే ధీమాలో వారంతా ఉన్నారు. ఇప్పటికే మిర్యాలగూడలో కాంగ్రెస్​ నేత లక్ష్మారెడ్డి తప్పకుండా పోటీ చేస్తానని ప్రకటించారు. వైరాలోనూ ఇదే సమస్య మొదలైంది. కొత్తగూడెంలో పెద్దగా రెబల్స్ బెడద లేకున్నా, చెన్నూరులోనూ ఈ సమస్య ఉంది. ఏకంగా సీపీఐ నేత నారాయణకు ఆ సెగ్మెంట్ కాంగ్రెస్ నేతలు కాల్ చేసి గొడవ పెట్టుకున్నారు. దీనిపై ఆడియోలు బయటకు వచ్చాయి. మరోపక్క మునుగోడు సీటుపై సీపీఐ నల్లగొండ జిల్లా కమిటీ పట్టుపడుతోంది. ఆ సీటు కేటాయించకపోతే, ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తామనే హెచ్చరికలూ చేశారు. ఒక చోట ఇలాంటి పోటీ ఉంటే, అన్ని చోట్ల అదే కొనసాగుతుందనే భయం పార్టీలో నెలకొన్నది. 

గతంలోనూ సీట్లు ఇచ్చి, పోటీ పెట్టారు 

2014, 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్​తో సీపీఐ పొత్తు పెట్టుకున్నది. ఆ టైమ్​లో రెబల్స్ పెట్టిన తిప్పలను ప్రస్తుతం కమ్యూనిస్టు నేతలు గుర్తు చేసుకుంటున్నారు. 2014లో ఏడు స్థానాలు ఇచ్చినా, మూడు నాలుగు చోట్ల రెబల్స్ రంగంలోకి దిగారు. 2018లో మూడు సీట్లు కేటాయించినా, అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను నిలిపింది. ఇలాంటి సమస్య మళ్లీ ఈసారి కూడా వస్తుందనే భయం సీపీఎం, సీపీఐ నేతల్లో కొనసాగుతోంది. అందుకే ముందుగానే తమకు కేటాయించిన సెగ్మెంట్లలో ఆశావహులతో మాట్లాడి, పోటీలో ఉండకుండా చూడాలని లెఫ్ట్ నేతలు కోరుతున్నారు. అయితే, గత అనుభవాలే పునరావృతం అవుతాయా? లేక పూర్తిస్థాయిలో కాంగ్రెస్ సహకరిస్తుందా? అనేది త్వరలో తేలనున్నది.