ఏదీ మార్చలే.. ఫైనల్ ఓటర్ లిస్ట్లో అవే పేర్లు

ఏదీ మార్చలే.. ఫైనల్ ఓటర్ లిస్ట్లో అవే పేర్లు
  • కాగితాలకే పరిమితమైన అభ్యంతరాలు
  • చనిపోయిన వారి పేర్లు తొలగించని ఆఫీసర్లు
  • ఆసక్తికరంగా మారిన ఆమనగల్లు​కోర్టు కేసు

మున్సిపాలిటీల్లో డ్రాఫ్ట్​ ఓటర్​ లిస్ట్​లో వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ఫైనల్  ఓటర్​  లిస్ట్​ విడుదల చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్రాఫ్ట్​ ఓటర్​ లిస్ట్​పై వచ్చిన అభ్యంతరాలపై ప్రస్తుతానికి ఎటువంటి చర్యలు తీసుకోలేమంటూ మున్సిపల్  అధికారులు వార్డుల వారీగా తుది జాబితాను విడుదల చేశారు. దీంతో ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదులో తప్పులు ఉన్నాయని, డబుల్​ ఎంట్రీలు, చనిపోయిన వారి పేర్లు తొలగించలేదని ఓ లాయర్ హైకోర్టును ఆశ్రయించారు.  దీంతో డ్రాఫ్ట్​ ఓటర్​ లిస్ట్​పై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి  ఆమనగల్లు​ మున్సిపల్​ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఫీల్డ్​ ఎంక్వైరీ చేయకపోవడమే సమస్య..

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఇండ్ల యజమానులకు తెలియకుండా పదుల సంఖ్యలో నమోదు చేసిన కొత్త ఓట్లు, ఒక వార్డు నుంచి మరో వార్డుకు మార్చిన ఓటర్ల ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పదేళ్ల కింద చనిపోయిన వారికి ఓటు హక్కు కల్పించారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలిచిన వారికి మున్సిపాలిటీల్లో ఓట్లు ఉండడం విశేషం. ఎన్నికల కమిషన్​ ఆదేశాల మేరకు గత ఏడాది అక్టోబర్​కు ముందు బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నమోదు, చనిపోయిన వారు, బదిలీపై వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగుల పేర్ల తొలగింపు, ఇతర మార్పులు, చేర్పులు చేపట్టారు.

అయితే బీఎల్వోలు ఇచ్చిన నివేదికలపై ఫీల్డ్​ విజిట్​ చేసి ఎంక్వైరీ చేయాల్సిన వార్డు ఆఫీసర్లు ఆఫీసులో కూర్చొని సంతకాలు చేసేశారు. గత ఏడాది అక్టోబర్ 10న పంపించిన ఓటర్​ లిస్ట్​నే ఫైనల్​ చేశారు. నాగర్​కర్నూల్​ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో డ్రాఫ్ట్​ ఓటర్​ లిస్ట్​లపై వచ్చిన ఫిర్యాదులను ఇప్పుడు పరిష్కరించలేమని అధికారులు తేల్చేశారు. ఫిర్యాదు చేసిన వారిని వ్యక్తిగతంగా కలిసి సంబంధిత పత్రాలు అందజేసి రిసీప్ట్​పై సంతకాలు తీసుకోవాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

చనిపోయినోళ్లకూ ఓటు హక్కు..

నాగర్​కర్నూల్​ మున్సిపాలిటీలో 24 వార్డులలో 35,378 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి వార్డులో చనిపోయిన వారి పేర్లు కనిపిస్తున్నాయి. పదేళ్ల కింద చనిపోయిన వారు ఇప్పటికీ రెండు అసెంబ్లీ, రెండు పార్లమెంట్, రెండు మున్సిపల్​ ఎన్నికల్లో ఓటరు జాబితాల్లో కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కొందరు సర్పం చులు,వార్డు మెంబర్ల పేర్లు మున్సిపాలిటీ ఓటర్​ లిస్ట్​లో  కొనసాగుతున్నాయి.

అడ్డగోలుగా వార్డుల విభజన,,

ఒక వార్డులోని ఓటర్లను మరో వార్డులో కలిపారు. జిల్లా కేంద్రంలోని ఎండబెట్ల, దేశీఇటిక్యాల, నాగనూలు, ఉయ్యాలవాడకు చెందిన ఓటర్లు నాగర్​ కర్నూల్​ పట్టణంలోని వార్డులకు కేటాయించారు. ఓటేయడానికి వీరంతా నాగర్​ కర్నూల్​కు వెళ్లాల్సి ఉంటుంది. గతంలో ఈ వార్డుల్లో గెలిచిన అభ్యర్థులు ఐదేళ్లు ఇటు వైపు తిరిగి చూడలేదన్న ఆరోపణలున్నాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.

ఔట్​ సోర్సింగ్​ సిబ్బందికి కీలక బాధ్యతలు?

మున్సిపల్​ ఎన్నికల నిర్వహణలో రెగ్యులర్​ ఉద్యోగుల కంటే కాంట్రాక్ట్, ఔట్​ సో ర్సింగ్​ సిబ్బందిపై ఎక్కువగా ఆధారపడుతున్నారనే విమర్శలున్నాయి. వార్డు ఆఫీసర్లు, ఆఫీస్​ సిబ్బందిని కాదని ఔట్​ సోర్సింగ్​ సిబ్బందికి మున్సిపల్​ కమిషనర్లు బాధ్యతలు, రికార్డులు అప్పగించి పనులు చేయిస్తున్నారని అంటున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మిగిలిన మున్సిపాలిటీల్లో తప్పులను సరిదిద్దాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.