మహబూబ్​నగర్​లో అమరరాజా బ్యాటరీ ఫ్యాక్టరీ..9500 కోట్ల పెట్టుబడి

మహబూబ్​నగర్​లో అమరరాజా బ్యాటరీ ఫ్యాక్టరీ..9500 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్, వెలుగు:  అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ మహబూబ్ నగర్ జిల్లాలోని దివిటిపల్లిలో లిథియం -అయాన్ బ్యాటరీ ఫ్యాక్టరీతో పాటు హైదరాబాద్​లో  పరిశోధన కేంద్రాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. రాబోయే 10 ఏళ్లలో కంపెనీ రూ.9,500 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టనుంది. మొదటిదశలో పెట్టుబడి రూ.1,500 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఫెసిలిటీ అవుట్​పుట్​ 16 గిగావాట్ హవర్​ వరకు ఉంటుంది. హైదరాబాద్​లో ఆర్​ అండ్​ డీ సెంటర్​ ఏర్పాటు చేస్తారు. ఈ రెండింటి వల్ల దాదాపు 4,500 మందికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర మున్సిపల్​, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్​,  ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, అమర రాజా బ్యాటరీస్  సీఎండీ జయదేవ్ సక్షమంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి.  అమర రాజా బ్యాటరీస్ తన అమరరాజా గిగా కారిడార్ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది.  అధునాతన రీసెర్చ్ అండ్ ఇన్నో వేషన్ సెంటర్ ను అమర రాజా ఈ–-హబ్ పేరిట హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రంలో మెటీరియల్ రీసెర్చ్, ప్రొటోటైపింగ్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అనాలిసిస్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ డిమాన్ స్ట్రేషన్ కోసం అధునాతన లేబొ రేటరీలు, టెస్టింగ్ వంటి సదుపాయాలు ఉంటాయి.  బ్యాటరీసెల్ టెక్నాలజీ ప్రొడక్టులను  భారీ స్థాయిలో తయారు చేసేందుకు  అమర రాజా అడ్వాన్స్​డ్​  సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్​లిమిటెడ్​ పేరిట సబ్సిడరీని ఏర్పాటు చేసింది.  ఈ సంస్థ కొన్ని టూ, త్రీవీలర్ కంపెనీలకు లిథియం బ్యాటరీలను, చార్జర్లను ఇప్పటికే సరఫరా చేస్తోంది. 

పెట్టుబడులకు ఇదే మంచి సమయం

ఈ సందర్భంగా జయదేవ్ గల్లా మాట్లాడుతూ  ‘‘తమ దగ్గర ఇన్వెస్ట్​ చేయాలని   ప్రభుత్వం చాలా కాలంగా కోరుతోంది. కరోనా వంటి సమస్యల వల్ల కొంత ఆలస్యం జరిగింది. ప్రస్తుతం మా పెట్టుబడులన్నీ ఏపీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్​కు గిరాకీ బాగా పెరిగింది. తెలంగాణలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇది సరైన సమయం. బ్యాటరీ తయారీ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణలో అన్ని సదుపాయాలూ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ విధానాలూ బాగుండబట్టే  హైదరాబాద్​ దగ్గర ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించాం ”అని వివరించారు.

ఇది భారీ పెట్టుబడి

మంత్రి కేటీఆర్​ మాట్లా డుతూ  ‘‘అమరరాజా గత 37 ఏళ్లుగా బ్యాటరీ తయారీరంగంలో ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్​ చేయాలని నేను వాళ్లను అడిగాను. ఇది లిథియం- అయాన్ సెల్ తయారీ రంగంలో భారతదేశంలోనే అతిపెద్ద పెట్టుబడి. ఈ ఫ్యాక్టరీ మన రాష్ట్రానికి రావడం ఎంతో గర్వకారణం. భారతదేశంలోనే ‘మోస్ట్​ ఎలక్ట్రిఫైడ్ స్టేట్​’గా తెలంగాణను మార్చడం మా లక్ష్యం. ఈవీ తయారీ హబ్ కావాలన్న మా  టార్గెట్​  అమరరాజా గిగా ఫ్యాక్టరీతో నిజమవుతుంది. రాష్ట్రంలో కరెంటు, నీరు, రోడ్లు వంటి అన్ని సదుపాయాలూ బాగుండటం వల్ల ఎన్నో కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాయి. తెలంగాణలో ట్యాలెంట్​కు కొదవ లేదు’’ అని అన్నారు.