ఎనలిస్టు కాల్​లో ఇండియా ఊసెత్తని అమెజాన్​

ఎనలిస్టు కాల్​లో ఇండియా ఊసెత్తని అమెజాన్​

ఆశ్చర్యపడుతున్న ఎనలిస్టులు

ముంబై: క్వార్టర్లీ ఎర్నింగ్స్​ కాల్​లో ఇండియా మార్కెట్ ​గురించిన ప్రస్తావనే  అమెజాన్​ తేలేదు. 2014 తర్వాత మన దేశపు మార్కెట్ గురించి మాట్లాడకుండా ఉండటం ఇదే మొదటిసారి. అమెజాన్​ పోకడ చాలా మంది ఎనలిస్టులను ఆశ్చర్యానికి గురి చేసినట్లు టెక్​క్రంచ్​ రిపోర్ట్​ చేసింది. అంతేకాదు, ఇండియా మార్కెట్లో వెనక్కి తగ్గే ఛాన్స్​ ఉందా అనే సందేహాలనూ ఎనలిస్టులలో రేకెత్తించిందని ఈ రిపోర్టు పేర్కొంది. సౌత్​ ఏషియాలో ఈ–కామర్స్​ (ఆన్​లైన్​ వ్యాపారాలు) హై గ్రోత్​ రేటుతో  దూసుకెళ్తున్న నేపథ్యంలో అమెజాన్​ ఇలా ఎందుకు చేసిందో అర్ధం కావడం లేదని ఎనలిస్టులు అంటున్నారు. ఇండియా మార్కెట్లో గత పదేళ్లలో అమెజాన్​ సుమారు 7 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. కానీ, వాల్​మార్ట్​ సపోర్ట్ ​ ఉన్న  ఫ్లిప్​కార్ట్​నుంచి అమెజాన్​ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. ఫ్లిప్​కార్ట్​ కిందటేడాదిలోనే 2.5 బిలియన్​ డాలర్లను పెట్టుబడి పెట్టినట్లు పై రిపోర్టు వెల్లడించింది.

ఈ ఏడాది జనవరిలో ఇండియాలోని 1,000 మంది ఉద్యోగులను అమెజాన్​ తొలగించింది. గ్లోబల్​గా చేపట్టిన రిట్రెంచ్​మెంట్​ ఎక్సర్​సైజులో భాగంగానే ఈ ఉద్యోగులను అమెజాన్​ ఇంటికి పంపించింది. గ్లోబల్​గా ఎకనమిక్​ కండిషన్లు అంతగా బాగుండకపోవడం వల్లే అన్ని దేశాలలోనూ కలిపి మొత్తం 18 వేల జాబ్స్​పై అమెజాన్​ వేటు వేసింది. ఇండియాలో  వెయ్యి మంది ఉద్యోగులను తీసేయడానికి ముందు అమెజాన్​కు లక్ష మంది ఉద్యోగులున్నారు. ఇండియా మార్కెట్​పై మరింత పట్టు సాధించాలనే ప్రయత్నాలనూ అమెజాన్​  చేస్తున్నట్లు కనిపిస్తోంది.  పారామౌంట్​ గ్లోబల్​తో కలిసి ఇంగ్లీష్ లాంగ్వేజ్​ ఎంటర్​టెయిన్​మెంట్​ ఆఫరింగ్స్​ను మన దేశపు మార్కెట్లోకి తేనున్నట్లు  ఈ ఏడాది ఏప్రిల్​ నెలలో అమెజాన్​ ప్రకటించింది. ఎలాంటి అదనపు ఖర్చూ లేకుండానే  ప్రస్తుత సబ్​స్క్రిప్షన్​తోనే యూజర్లు  ఈ కంటెంట్​ను చూడొచ్చని  తెలిపింది.