అంబేద్కర్​ను ఆదర్శంగా తీసుకోవాలి : విశాక జేఎండీ గడ్డం వంశీకృష్ణ

అంబేద్కర్​ను ఆదర్శంగా తీసుకోవాలి : విశాక జేఎండీ గడ్డం వంశీకృష్ణ
  • కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

ముషీరాబాద్, వెలుగు : బీఆర్ అంబేద్కర్ దూరదృష్టితోనే రాజ్యాంగం రాశారని... 75 ఏండ్లయినా మనకు ఎంతో ఆదర్శంగా ఉందని విశాక ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.  మన దేశంలోని ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించి  ప్రపంచంలోనే  అత్యుత్తమ, అతిపెద్ద  రాజ్యాంగంగా నిలిచిందని చెప్పారు.  బాగ్​లింగంపల్లి లోని కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో  రిపబ్లిక్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. గడ్డం వంశీకృష్ణ, ప్రైమరీ స్కూల్ ఇన్ చార్జి గడ్డం రోషిణి, ఇనిస్టిట్యూషన్స్ జాయింట్ సెక్రటరీ పీవీ రమణ కుమార్ హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ ను ప్రతి   ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

కాకా వెంకటస్వామి పదో తరగతి వరకు చదివినా.. భవిష్యత్​లో పేద స్టూడెంట్లు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ఇనిస్టిట్యూషన్స్ నెలకొల్పారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులంతా మంచిగా చదువుకుని ఉన్నతస్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు కాలేజీ ఎన్ సీసీ కమాండర్, క్యాడెట్స్ చేసిన వాఘా సరిహద్దు విన్యాసాలు, విద్యార్థుల దేశభక్తి గీతాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.  కాకా వెంకట స్వామి మీద రాసిన ఆట పాటలు ఎంతో ఆలోచింపజేశాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్ డైరెక్టర్స్ , ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.