చరిత్రలో కొందరి మరణం ఒక ముగింపు, కానీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మరణం మాత్రం ఒక కొత్త ప్రారంభం. ఈ దేశంలో బహుజన సమాజ మార్పుకోసం తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయుల్లో బి.ఆర్. అంబేద్కర్ అగ్రగణ్యులు. ఆయన జీవితం కేవలం ఒక వ్యక్తి విజయం కాదు, అది కోట్లాదిమంది బహుజనులకు ఆత్మగౌరవాన్ని, సమానత్వాన్ని, స్వేచ్ఛను అందించిన మహత్తర ఉద్యమం. ఆయన వేసిన ప్రతి అడుగు సమాజాన్ని ముందుకు నడిపింది, ఆయన వేసిన చివరి అడుగు మనకు ఒక నూతన మార్గాన్ని చూపించింది, ఆ అడుగే ఇప్పుడు మన తొలి అడుగు కావాలి.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితాన్ని పరిశీలిస్తే, ఆయన ఒకటే లక్ష్యం కోసం బతికారు. అది సమానత్వం. ఆయన చిన్నతనం నుంచే ఎన్నో అవమానాలను, వివక్షను ఎదుర్కొన్నారు. కులం కారణంగా చదువుకోవడం కష్టమైనప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా, ఎంతో కష్టపడి ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలైన కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత విద్యను అభ్యసించి ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. చదువు బానిస సంకెళ్లను తెంచే ఆయుధమని గ్రహించి చదువునే ఆయుధంగా చేసుకొని తన పోరాటాన్ని సాగించారు. 1935లో యోలా సభలో ‘నేను హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా మాత్రం చనిపోను’ అని ఆయన చేసిన ప్రతిజ్ఞ ఆయన చివరి అడుగుకు బీజం వేసింది. ఆయన బహుజనుల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడారు, రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి దిశానిర్దేశం చేశారు.
అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని ఎందుకు తీసుకున్నారు?
హిందూ మతం అసమానతల మీద ఆధారపడి ఉంది. కుల వ్యవస్థ దాని పునాది. ఒకరు బ్రాహ్మణుడిగా పుడితే గొప్పవాడు, ఒకరు మహర్గా పుడితే తక్కువవాడు. ఇది మనిషి పుట్టుకను బట్టి గౌరవాన్ని నిర్ణయిస్తుంది. కానీ బౌద్ధ ధర్మం సమానత్వాన్ని బోధిస్తుంది. బుద్ధుడు అందరూ సమానమే అన్నాడు. మనిషి గొప్పతనం అతని పుట్టుకలో కాదు, అతని శీలంలో ఉందని చెప్పాడు. మనిషిని కాపాడే మతం కావాలి. నాకు దేవుడిని కాపాడే మతం వద్దు, మనిషిని కాపాడే మతం కావాలి. బౌద్ధ ధర్మంలో మనిషే ప్రధానం. ‘నీ విముక్తికి నీవే కర్తవు. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఏ దేవుడూ వచ్చి నిన్ను కాపాడడు’ అని బుద్ధుడు చెప్పాడు. బౌద్ధం కార్యకారణ సంబంధాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని బోధిస్తుంది. ఇది మూఢనమ్మకాలను కాదు,
ప్రజ్ఞను, వివేకాన్ని నమ్ముతుంది.
ఆత్మగౌరవం
బౌద్ధంలో కులం లేదు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, పేద, ధనిక అన్న భేదం లేదు. బుద్ధుడి సంఘంలో మంగలి, చాకలి, మాల, మాదిగ, మహారాజు ఎవరైనా అందరూ సమానమే. బుద్ధుడు చెప్పిన మొదటి విషయం - ప్రతీది ప్రశ్నించు. గుడ్డిగా నమ్మొద్దు. నేను చెప్పినా కూడా నమ్మకు, పరిశీలించు, నీ అనుభవంలో నిజమైతేనే నమ్ము. ఈ సూత్రం చాలు మనిషి ఆలోచన శక్తిని పెంచి జ్ఞానాన్ని పెంపొందించడానికి. బౌద్ధం నీకు కరుణ నేర్పుతుంది. అన్యాయాన్ని ఎదిరించమంటుంది. బుద్ధుడు శాంతిని బోధించాడు, కానీ అన్యాయంతో రాజీపడమని ఎప్పుడూ చెప్పలేదు.
రాజ్యాధికారం
హిందూ మతం ఒకే జాతిగా ఉన్న బహుజనులను కులాలుగా విభజించింది. అది మనలను ఓటరుగా మాత్రమే ఉంచుతుంది. కానీ బౌద్ధం మనల్ని ఐక్యం చేసి పాలకులను చేస్తుంది. అశోకుడు బౌద్ధం స్వీకరించిన తర్వాతే ప్రపంచాన్ని ఏలాడు. చరిత్రలో బౌద్ధం ఉన్న చోటే సమానత్వం ఉంది. 1956 డిసెంబర్ 6న బి.ఆర్ అంబేద్కర్ మరణించినప్పుడు ఆయన చేతిలో ‘బుద్ధ అండ్ హిజ్ ధమ్మ’ అనే గ్రంథం ఉంది.
అంటే చివరి శ్వాసవరకు ఆయన మన విముక్తి గురించే ఆలోచించారు, ఆ మార్గాన్ని మనకు చూపించారు. మనం మనువాదాన్ని వదిలి శాస్త్రీయంగా ఆలోచించడం, మనం కులాలుగా విడిపోకుండా బహుజనులుగా ఏకం కావడమే మన తొలి అడుగు. ఆయన చివరి అడుగు బానిసత్వం నుండి స్వేచ్ఛ వైపు పడింది. మన తొలి అడుగు స్వేచ్ఛ నుంచి పాలన వైపు పడాలి. అప్పుడే అంబేద్కర్ కన్న కలల రాజ్యాధికారం సాధ్యమవుతుంది.
నేడు అంబేద్కర్ బౌద్ధ ధర్మం స్వీకరించిన రోజు
దాదాపు 21 సంవత్సరాలు అంబేద్కర్ అన్ని మతాలను లోతుగా అధ్యయనం చేశారు. చివరికి ఆయనకు బుద్ధుడిలోనే తన ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది. బుద్ధుడు చెప్పిన సమత, కరుణ, ప్రజ్ఞ, మైత్రి - ఇవే నిజమైన మానవ ధర్మాలని నమ్మారు. బౌద్ధం ఏ దేవుడినీ నమ్మమనదు, మనిషిని మనిషిగా గౌరవించమంటుంది. కులాన్ని కాదు, శీలాన్ని చూస్తుంది. అందుకే 14 అక్టోబర్ 1956న నాగ్పూర్లోని దీక్షాభూమిలో ఐదు లక్షల మంది బహుజనులతో కలిసి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు.
అది కేవలం మత మార్పిడి కాదు, అది ఆత్మగౌరవ పోరాటంలో అత్యున్నత ఘట్టం. ఆయన ఇచ్చిన 22 ప్రతిజ్ఞలు మనకు మార్గదర్శకాలు. బి.ఆర్.అంబేద్కర్ వేసిన ఆ చివరి అడుగు మనకు ఒక పెద్ద సత్యాన్ని నేర్పుతుంది, ఆత్మగౌరవం అడుక్కుంటే, ప్రకటించుకుంటే వచ్చేది కాదు, విముక్తి ఎవరో ఇచ్చేది కాదు, మనమే తీసుకోవాలి.
