నారాయణ కాలేజీలో దారుణం..

నారాయణ కాలేజీలో దారుణం..

హైదరాబాద్లో దారుణం జరిగింది. అంబర్ పేట నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రిన్సిపల్ రూంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడే ఉన్న ప్రిన్సిపల్ తో పాటు ఏఓకు గాయాలలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని తొలుత సికింద్రాబాద్ యశోదా హస్పిటల్ కు ఆ తర్వాత డీఆర్డీవో అపోలో హాస్పిటల్ కు తరలించారు.

రామంతపూర్ కు చెందిన విద్యార్థి సాయి నారాయణ అంబర్పేట నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండటంతో టీసీ కోసం వారం రోజులుగా కాలేజీకి వెళ్లి అడుగుతున్నాడు. అయితే ఫీజు బాకీ ఉన్నారంటూ సిబ్బంది టీసీ ఇచ్చేందుకు నిరాకరించారు. రూ.16వేలు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని ప్రిన్సిపల్ స్పష్టం చేయడంతో ఇవాళ స్టూడెంట్ యూనియన్ లీడర్లతో కలిసి కాలేజీ వద్దకు వెళ్లారు. టీసీ విషయంలో ప్రిన్సిపల్ ఆశోక్ రెడ్డికి  విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విద్యార్థి సంఘం నాయకుడు వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని భయపెట్టే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో స్టూడెంట్ యూనియన్ లీడర్ సందీప్, విద్యార్థి వెంకటాచారితో పాటు ప్రిన్సిపల్ అశోక్ రెడ్డితో పాటు ఏఓకు గాయాలయ్యాయి. అయితే స్టూడెంట్ యూనియన్ లీడర్ స్వయంగా నిప్పు పెట్టుకున్నాడా లేక గదిలో దేవుడి ముందు వెలిగించిన దీపం అంటుకుని మంటలు చెలరేగాయా అన్నది తెలియాల్సి ఉంది.  

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, మిగతా విద్యార్థులు గాయపడిన వారిని 108లో గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వారిలో స్టూడెంట్ యూనియన్ లీడర్ సందీప్ తో పాటు ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాలేజీ ఆవరణతో పాటు ప్రిన్సిపల్ రూంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి కాలేజ్ విద్యార్థులు, సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గాంధీ హాస్పిటల్ వద్ద హైటెన్షన్ నెలకొంది. విద్యార్థి సంఘం నాయకుడు గాయపడటంతో భారీ సంఖ్యలో ఓయూ స్టూడెంట్స్ గాంధీ హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే ఇంత జరిగినా కాలేజ్ యాజమాన్యం గానీ, ఇంటర్ బోర్డుగానీ, విద్యాశాఖ గానీ స్పందించలేదు.

ఇదిలా ఉంటే అంబర్ పేట నారాయణ కాలేజీ ఘటనపై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు.జిల్లా విద్యా శాఖాధికారులతో పాటు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారని ప్రకటించారు. పోలీసులు కాలేజీలోని సీసీ టీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఘటనకు సంబంధించి సమగ్ర వివరణ ఇవ్వాలని కాలేజ్ సెక్రటరీ, కరస్పాండెంట్ ను ఆదేశించినట్లు డీఐఈఓ స్పష్టం చేశారు.