అంబులెన్స్ ల దందా.. కరోనా పేషేంట్ల వద్ద డబుల్ రేట్లు వసూలు

అంబులెన్స్ ల దందా.. కరోనా పేషేంట్ల వద్ద డబుల్ రేట్లు వసూలు
  • కరోనా పేషెంట్ల వద్ద డబుల్ రేట్లు వసూలు
  • డెడ్​బాడీ తీసుకెళ్లాలంటే నాలుగు రెట్లు గుంజుతున్రు
  • కంప్లైంట్లు చేసినా చర్యల్లేవ్​ కిలోమీటర్ల లెక్కన రేట్లు ఫిక్స్ చేయాలంటున్న పబ్లిక్
  • సర్కార్​ దవాఖాన్లలో అరకొర అంబులెన్స్​లు        


వెలుగు, నెట్​ వర్క్​

108 అంబులెన్స్​లు లోకల్​ అవసరాలకే పరిమితం కావడం, సరిపడా డ్రైవర్లు, మెయింటనెన్స్ లేక ప్రభుత్వ అంబులెన్స్​లు చాలావరకు మూలనపడడంతో కరోనా కష్టకాలంలో జనం ప్రైవేట్ అంబులెన్స్​లను ఆశ్రయించక తప్పట్లేదు. ఇదే అదనుగా వాటి ఆపరేటర్లు సిండికేట్​గా మారి, రేట్లు డబుల్ చేసి ప్రజల్ని దోచుకుంటున్నారు.

జిల్లా కేంద్రాల్లో ఒకటి, రెండు అంబులెన్స్​లే.. 

జిల్లా కేంద్రాల్లోని సర్కార్ దవాఖాన్లలో ఒకటి, రెండు అంబులెన్స్​లు మాత్రమే ఉన్నాయి. వాటిలోనూ రిపేర్లతో కొన్ని  మూలపడ్డాయి. కరోనా ఫస్ట్ వేవ్​లో అంబులెన్స్​ల అవసరం పెరగడంతో మంత్రి కేటీఆర్​ పిలుపుమేరకు కొన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గ నిధులతో ‘గిఫ్ట్​ ఏ స్మైల్​’ కింద వెంటిలేటర్​ అంబులెన్స్​లు కొని సర్కార్​దవాఖాన్లకు అందజేశారు. కానీ వాటిలో కొన్ని డ్రైవర్లు లేక షెడ్లకే పరిమితమయ్యాయి. ఇంకొన్నింటిని వాక్సినేషన్​ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. మిగితావాటిని వివిధ ప్రాంతాల నుంచి పేషెంట్లను జిల్లాకేంద్రాలకు తెచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. ఎమర్జెన్సీ పేషెంట్లను హైదరాబాద్​ తీసుకెళ్లేందుకు మాత్రం వీటిని ఇవ్వడం లేదు.

108 జస్ట్ ఫర్ లోకల్​.. 

రాష్ట్రంలో 108 అంబులెన్స్​లు 428 ఉన్నాయి. కొంతకాలంగా వీటి ద్వారా కరోనా పేషెంట్లకు సేవలు అందిస్తున్నారు. కానీ ప్రతి 108 అంబులెన్స్​కంటూ ఒక పరిధి ఉంటోంది. ఆయా మండలాలు దాటి వెళ్లేందుకు రూల్స్ ఒప్పుకోవు. ఎమర్జెన్సీ టైంలో కూడా ఆ పరిధి దాటి కరోనా పేషెంట్​ను తీసుకెళ్లే పరిస్థితి లేదు. దీంతో పబ్లిక్ విధిలేక ప్రైవేట్ అంబులెన్స్​ల వైపు వెళ్తున్నారు.

చార్జీలు రెండింతలు పెంచిన్రు..

గతంలో వంద కిలోమీటర్ల దూరానికి అంబులెన్స్​కు కిలోమీటర్ కు రూ.60 చొప్పున రూ.6వేల వరకు, వెంటిలేటర్ అంబులెన్స్​కు రూ. 80 చొప్పున రూ.8వేల వరకు చార్జి చేసేవారు. ఇప్పుడు 100 కిలోమీటర్లకు రూ.15వేల వరకు, వెంటిలేటర్ అంబులెన్స్​కు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. డెడ్​బాడీ అయితే ఇంతకు డబుల్ తీసుకుంటున్నారు. లోకల్​గా ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్​కు తీసుకెళ్లాలన్నా రూ.3వేల నుంచి రూ.5వేల దాకా గుంజుతున్నారు. జిల్లాల్లో కనీసం 50 కిలోమీటర్ల దూరంలోని హాస్పిటల్ తీసుకెళ్లాలంటే రూ.10వేలకు పైగా వసూలు చేస్తున్నారు. అదే ఒక డెడ్​బాడీని జిల్లాకేంద్రం నుంచి 50 కిలోమీటర్ల దూరం తీసుకురావాలంటే రూ.20వేలకు పైమాటే. అసలే ప్రైవేట్​ హాస్పిటళ్లు అడ్డగోలు బిల్లులతో జనం రక్తం తాగుతుండగా, ఈ అంబులెన్స్​ల దోపిడీ తో పేద, మధ్యతరగతి కుటుంబాలు అల్లాడిపోతున్నాయి.

సిండికేట్ కావడం వల్లే..

అన్ని జిల్లాకేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో ప్రైవేట్ అంబులెన్స్​ల నిర్వాహకులు సిండికేట్​గా మారడం వల్లే రేట్లు ఈ స్థాయిలో పెరిగినట్లు తెలుస్తోంది. కోవిడ్​ కు ముందు నుంచే ఈ తరహా సిండికేట్​ దందా ఉన్నప్పటికీ కిలోమీటర్​కు ఇంత అని చార్జి చేసేవారు. కరోనా తీవ్రతతో అంబులెన్స్​లకు డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా రేట్లు డబుల్ చేశారు. ఆక్సిజన్ ఉన్న నార్మల్ అంబులెన్స్ కు ఓ రేటు, వెంటిలేటర్ అంబులెన్స్​లకో రేటు ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. అడిగినంత చేతిలో పెడితేనే అంబులెన్స్ ను తీస్తున్నారు. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్​నగర్ జిల్లాకేంద్రాల్లో ఈ అంబులెన్స్​ల సిండికేట్​ బలంగా ఉంది. చాలామంది అంబులెన్స్​ల నిర్వాహకులు కమిషన్ ఏజెంట్లుగానూ పనిచేస్తున్నారు. కొన్ని ప్రైవేట్​ హాస్పిటల్స్ మేనేజ్​మెంట్లతో ముందే అగ్రిమెంట్ చేసుకొని పేషెంట్లను అక్కడికే తీసుకెళ్తున్నారు. ఇందుకు  పేషెంట్ కండీషన్​ను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.5వేల దాకా తీసుకుంటున్నారు. చివరికి ఆ భారం కూడా హాస్పిటళ్లు తమ బిల్లు లో ఏదో రూపంలో పేషెంట్లపైనే మోపుతున్నారు. ఈ అంబులెన్స్​ల దోపిడీపై జిల్లా ఆఫీసర్లకు ఫిర్యాదులు వస్తున్నా కనీస చర్యలు తీసుకోవడం లేదు. కిలోమీటర్​కు ఇంత అని రేట్లు ఫిక్స్​ చేయాలని పబ్లిక్ కోరుతున్నా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.

రూ.40వేలు తీసుకున్నరు..

మా మామయ్య కు గత నెల 12న కరోనా పాజిటివ్ వచ్చింది. లంగ్స్ లో ఇన్​ఫెక్షన్ తీవ్రం కావడంతో  హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు. ప్రభుత్వ అంబులెన్స్ లేక ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడితే ఆక్సిజన్ తో రూ.35వేలు డిమాండ్ చేశారు. వీటితో పాటు పీపీఈ కిట్ల పేరుతో మరో రూ.5వేలు ఇవ్వాలన్నారు. అందరూ సిండికేట్ కావడంతో ఎవ్వరిని అడిగినా ఇదే రేటు చెప్పారు. చేసేది లేక రూ.40వేలు ఇచ్చాం. ఈ విషయంలో ఆఫీసర్లు స్పందించి, అంబులెన్స్​లకు కిలోమీటర్​కు ఇంత అని రేట్ ఫిక్స్ చేయాలి. లేదంటే మా లాంటి పేదలు అప్పులపాలు కావాల్సి వస్తుంది.
‑ అశోక్, సూర్యాపేట

వనపర్తికి చెందిన సాయి ప్రకాశ్​(49)కు కరోనా​ సోకి సీరియస్​ కావడంతో ప్రైవేట్ అంబులెన్స్​లో హైదరాబాద్ తరలించారు. 150 కిలోమీటర్ల దూరానికి రూ.15వేలు వసూలు చేశారు. రెండు రోజుల తర్వాత ఆయన భార్య ఉమాదేవి(45)కి సీరియస్​ కావడంతో ఆమెను కూడా హైదరాబాద్​ తీసుకెళ్లారు. ఇందుకోసం అంబులెన్స్​కు మరో రూ.15 వేలు చెల్లించారు. ఏప్రిల్​ 27న సాయిప్రకాశ్​ మరణించగా, డెడ్​బాడీ తెచ్చేందుకు రూ.30 వేలు తీసుకున్నారు. మూడు రోజుల తర్వాత ఏప్రిల్ 30న ఉమాదేవి కూడా చనిపోయారు. ఆమె మృతదేహాన్ని తెచ్చేందుకు అంబులెన్స్​కు మరో రూ.30వేలు చెల్లించాల్సి వచ్చింది. అంటే ఇద్దరు పేషెంట్లను తీసుకెళ్లి, డెడ్​బాడీలను తిరిగి తేవడానికే ఆ కుటుంబానికి ఏకంగా రూ.90 వేలు ఖర్చయింది. 

ఏ జిల్లాలో చూసినా.. 

  • ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని మూడు అంబులెన్స్ లను రెగ్యులర్ అవసరాలకే వాడుతున్నారు. దీంతో కరోనా పేషెంట్లు ప్రైవేట్ అంబులెన్స్ లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ఆక్సిజన్ ఉన్న అంబులెన్స్​ల నిర్వాహకులు రూ.20వేల నుంచి రూ.25వేలు చార్జి చేస్తున్నారు. డెడ్ బాడీలను తీసుకొచ్చేందుకు ఇంతకు డబుల్​ తీసుకుంటున్నారు. 
  • ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్​కు రూ.10 వేలు వసూలు చేసినవాళ్లు, ఇప్పుడు రూ.20వేల దాకా తీసుకుంటున్నారు. 
  • నిర్మల్​ జిల్లా హాస్పిటల్‍లో ఒక్కటే అంబులెన్స్ ఉంది. గిఫ్ట్ ఏ స్మైల్​ కింద మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి 3 అంబులెన్స్​లు అందిస్తే వాటిని108గా మార్చారు. కరీంనగర్​కు రూ.10 వేలు, హైదరాబాద్​కు రూ.15 వేలు తీసుకుంటున్నారు. ఆయా చోట్ల నుంచి డెడ్‍బాడీ తీసుకురావాలంటే రూ.20 వేలు వసూలు చేస్తున్నారు.
  • వరంగల్​ అర్బన్​ జిల్లాలో 14 ప్రభుత్వ అంబులెన్స్​లు ఉన్నా అవన్నీ లోకల్​ అవసరాలకే ఉపయోగపడుతున్నాయి. హైదరాబాద్ వెళ్లాలంటే ప్రైవేటు అంబులెన్స్​లను ఆశ్రయించాల్సిందే. సాధారణ రోజుల్లో ఎంజీఎం నుంచి హైదరాబాద్​కు పేషెంట్​ను తీసుకెళ్లాలంటే రూ.10 వేల నుంచి రూ.15వేలు తీసుకునేవారు. ప్రస్తుతం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు.
  • కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే గతంలో రూ.8వేలు, వెంటిలేటర్ అంబులెన్సులకు  రూ.15వేల దాకా తీసుకునేవాళ్లు. ఇప్పుడు ఈ రేట్లను రూ.12వేలు, రూ.25వేలకు పెంచారు. ఇక్కడి నుంచి మంచిర్యాల, కాగజ్​నగర్ లాంటి ప్రాంతాలకు కూడా హైదరాబాద్ స్థాయిలో చార్జీలు వసూలు చేస్తున్నారు.​
  • పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో రెండు అంబులెన్స్ లు ఉండగా, డ్రైవర్లు లేక పక్కనపెట్టారు. ప్రైవేటు అంబులెన్స్​లు పెద్దపల్లి నుంచి హైదరాబాద్​కు గతంలో రూ.12వేలు తీసుకునేవారు. ఇప్పుడు ఏకంగా  రూ. 20వేల నుంచి 30 వేలు తీసుకుంటున్నారు. 
  • భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 108 లు తప్ప ప్రభుత్వ అంబులెన్స్ లు లేవు. అక్కడి నుంచి వరంగల్ కు 10వేలు, హైదరాబాద్​కు రూ.15 నుంచి 20వేల దాకా వసూలు చేస్తున్నారు.
  • మెదక్ లోని పెద్దాసుపత్రిలో ఒక అంబులెన్స్ ఉన్నా దానిని కరోనా పేషెంట్లకు ఇవ్వడం లేదు. ప్రైవేట్​ అంబులెన్స్​లు మెదక్ నుంచి హైదరాబాద్ కు 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో రూ.5వేలు తీసుకునేవారు.
  • సంగారెడ్డి నుంచి హైదరాబాద్​కు ప్రైవేట్ అంబులెన్స్​లు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నారు.
  • సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేకంగా ఒక్క అంబులెన్స్ కూడా లేదు. ఒక ప్రైవేటు సంస్థ ఇచ్చిన అంబులెన్స్ ను వ్యాక్సినేషన్ కోసం వినియోగిస్తున్నారు. ప్రైవేట్ ఆంబులెన్స్​లు హైదరాబాద్‌‌‌‌కు రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు.
  • సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి గతంలో హైదరాబాద్ కు రూ.3వేలు తీసుకునేవారు. ఇప్పుడు ఆక్సిజన్ తో రూ.25వేలు, ఆక్సిజన్ లేకుంటే రూ. 20వేల దాకా వసూలు చేస్తున్నారు. పీపీఈ కిట్​, శానిటేషన్ కోసం అంటూ అదనంగా బాదుతున్నారు.
  • ఖమ్మం నుంచి హైదరాబాద్​కు గతంలో  12వేలు తీసుకునేవారు. ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. లోకల్​గానూ రూ.5వేల దాకా వసూలుచేస్తున్నారు.
  • మహబూబ్​నగర్ నుంచి హైదరాబాద్​కు ప్రైవేట్ అంబులెన్స్ ల్లో గతంలో రూ.5వేలు తీసుకునేవారు. ఇప్పుడు ఏకంగా రూ.18వేల నుంచి రూ.25వేల వరకు వసూలు చేస్తున్నారు.
  •   నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్​ తీసుకెళ్లేందుకు ప్రైవేట్ అంబులెన్స్​లు రూ.10 వేల నుంచి రూ.25వేల వరకు వసూలు చేస్తున్నారు.