నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై ఫిర్యాదు రాలే : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ  మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై ఫిర్యాదు రాలే : కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

  • ర్యాగింగ్​ చేయలేదని విద్యార్థులు చెప్పారు
  • కలెక్టర్​ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు విద్యార్థుల నుంచి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఫిర్యాదు రాలేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు శుక్రవారం మీడియాలో వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. స్థానిక సంస్థల ఇన్​చార్జి అడిషనల్​కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవో అశోక్ రెడ్డితో కలిసి కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, హెచ్ వోడీలు, లెక్చరర్లు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులతో విడివిడిగా మాట్లాడారు.

తమను ఎవరూ ర్యాగింగ్ చేయలేదని, అందరం స్నేహపూర్వక వాతావరణంలోనే ఉంటున్నామని విద్యార్థులు చెప్పారన్నారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ.. ర్యాగింగ్ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటోందని, తప్పు చేసినవారిని కాలేజీ నుంచి తొలగిస్తామని, క్రిమినల్​ చర్యలుంటాయని హెచ్చరించారు. ఎలాంటి రికమెండేషన్లు పని చేయవని, విలువైన జీవితాన్ని కోల్పోవద్దని చెప్పారు. సమాజంలో ఒక  మంచి డాక్టర్ గా సేవలందించే అంశంపై దృష్టి సారించాలని సూచించారు. సీసీ ఫుటేజీ కూడా పరిశీలిస్తామని, ఇకపై వైద్య కళాశాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. ఏవైనా సమస్యలుంటే విద్యార్థులు స్థానిక సంస్థల ఇన్​చార్జి అడిషనల్ కలెక్టర్, నల్గొండ ఆర్డీవోకు తెలియజేయాలని చెప్పి, వారి ఫోన్ నంబర్లను ఇచ్చారు. 

యంగ్ ఇండియా స్కూల్​ పనులు త్వరగా పూర్తవ్వాలి  

నల్గొండలోని ఎస్ఎల్ బీసీ కాలనీ వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం పాఠశాల పనులను తనిఖీ చేశారు. రానున్న విద్యాసంవత్సరం నాటికి పనులు పూర్తి చేయాలని ఈఈ, కాంట్రాక్టర్ కు సూచించారు. అడిషనల్​కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్, ఆర్డీవో అశోక్ రెడ్డి తదితరులున్నారు.