పంచాయతీ రాజ్ యాక్ట్​లో సవరణలు

పంచాయతీ రాజ్ యాక్ట్​లో సవరణలు

హైదరాబాద్, వెలుగు:  జిల్లా, మండల పరిషత్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మెంబర్లు, కో ఆప్షన్ల ఉప ఎన్నికలపై ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో నంబర్  11 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ పదవులు ఖాళీ అయితే.. 6 నెలల్లో ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఆ రూల్ ను తొలగిస్తూ పంచాయతీ రాజ్ యాక్ట్ లో సవరణలు చేశారు. ఇందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేయటంతో గెజిట్ లో చేర్చుతున్నట్లు తెలిపారు.  

పదవి ఖాళీ అయిన 6 నెలల్లో ఎన్నిక నిర్వహించాలని పంచాయతీ రాజ్ యాక్ట్ 2018లో పేర్కొన్నారు. అయితే రాష్ర్టంలో 3 ఏళ్ల నుంచి లోకల్ బాడీల్లో సుమారు 6 వేలకు పైగా పలు పదవులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు రాష్ర్ట ఎన్నికల సంఘం సిద్ధమైనా గత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 

లోకల్ బాడీ ఎంప్లాయిస్ సిలబస్ లో మార్పులు

లోకల్ బాడీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్ మెంటల్ టెస్ట్ అకౌంట్స్ పరీక్షల సిలబస్ లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న సిలబస్  ఉమ్మడి రాష్ర్టంలో ఖరారు చేసిందని, తెలంగాణ ఉద్యమం, చరిత్రకు ఆ సిలబస్ కు సంబంధం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని డిపార్ట్ మెంటల్ టెస్ట్ ల సిలబస్ లు మార్చాలని టీఎస్ పీఎస్సీ కోరిన నేపధ్యంలో మార్పులు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. కొత్త సిలబస్ లో ఉపాధి హామీ, తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ 2018, ఆర్టీఐ, కనీస వేతనాల చట్టం వంటి వివరాలను చేర్చారు.