ఆరు నెలల్లో గ్రీన్ కార్డు దరఖాస్తులు పరిష్కరించాలి

ఆరు నెలల్లో గ్రీన్ కార్డు దరఖాస్తులు పరిష్కరించాలి

వాషింగ్టన్​: గ్రీన్​కార్డులు లేదా శాశ్వత నివాస హోదా కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేలాది మంది ఇండియన్లకు అమెరికా శుభవార్తను చెప్పింది. గ్రీన్​కార్డు దరఖాస్తులన్నింటినీ 6 నెలల్లోగా పరిష్కరించాలంటూ యూఎస్ సిటిజన్​షిప్​ అండ్​ ఇమిగ్రేషన్​ సర్వీసెస్​(యూఎస్​సీఐఎస్​)కు ప్రెసిడెన్షియల్​ కమిషన్​ ప్రతిపాదించింది. ఇండియన్​ అమెరికన్​ అజయ్​ జైన్​ భుటోరియా ప్రవేశపెట్టిన ఆ ప్రతిపాదనను ప్రెసిడెన్షియల్​ కమిషన్​లోని 25 మంది కమిషనర్లు ఆమోదించారు. ఆ ప్రతిపాదనలను ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్​ ఆమోదానికి వైట్​హౌస్​కు పంపారు. వాటికి ఆమోదముద్ర పడితే ఇండియన్లతో పాటు లక్షలాది మంది వలసదారులకు మేలు కలగనుంది. 

ఇవీ ప్రతిపాదనలు..

ఇప్పటికే పెండింగ్​లో ఉన్న గ్రీన్​కార్డుల అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాల్సిందిగా యూఎస్​సీఐఎస్​కు ప్రెసిడెన్షియల్​ కమిషన్​ సూచించింది. గ్రీన్​కార్డు దరఖాస్తుల ప్రక్రియ, వ్యవస్థ, విధానాలపై సమీక్ష చేయాలని చెప్పింది. గ్రీన్​కార్డులను నిర్ణీత కాలంలో అందించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించింది. గ్రీన్​కార్డులకు మాన్యువల్​గా కాకుండా ఆటోమేటిక్​గా ఆమోదం తెలిపే వ్యవస్థను తేవాలని పేర్కొంది. ఇంటర్నల్​ డ్యాష్​బోర్డులు, రిపోర్టింగ్​ సిస్టమ్స్​ను మెరుగుపర్చాలని,  కుటుంబ గ్రీన్​కార్డుల దరఖాస్తులు, డీఏసీఏ పునరుద్ధరణలు, ఇతర గ్రీన్​ కార్డ్​ అప్లికేషన్లను 6నెలల్లోగా పరిశీలించి నిర్ణయం తెలియజేయాలని చెప్పింది. దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలు త్వరగా పూర్తిచేసేందుకు ఆగస్టు నాటికి మరింత మంది అధికారులను నియమించుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఏటా 32,439 గ్రీన్​కార్డులకు ఆమోదం తెలుపుతున్నారని, ఈ ఏడాది గ్రీన్​కార్డులను 150 శాతానికి పెంచాలని స్పష్టం చేసింది. వర్క్​పర్మిట్స్​, ట్రావెల్​ డాక్యుమెంట్లు, నివాసహోదా తాత్కాలిక పొడిగింపుకోసంపెట్టుకున్న విజ్ఞప్తులను 3  నెలల్లోగా సమీక్షించాలని యూఎస్​సీఐఎస్​కు సూచించింది.