
Dropbox Visa Renewal: అమెరికా ప్రభుత్వం ఇటీవల ఒక కీలక నిర్ణయం ప్రకటించింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న "డ్రాప్‌బాక్స్" వీసా రెన్యూవల్ ప్రోగ్రామ్ లేదా ఇంటర్వ్యూ రహిత ప్రోగ్రామ్ ను రద్దు చేసింది. 2025 సెప్టెంబర్ 2 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ మార్పులతో భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా యూఎస్ వీసా ప్రక్రియలో భారీ మార్పులు రాబోతున్నాయి.
అసలు డ్రాప్‌బాక్స్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి?
ఇప్పటి వరకు H-1B, H-4, F, M, O1, J, L-1 కేటగిరీల కింద యూఎస్ వీసాలు కలిగిన వ్యక్తులు మళ్లీ వీసా రెన్యూవల్ కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చినప్పుడు.. వారు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకు హాజరుకావలసిన అవసరం ఉండేది కాదు. బదులుగా రెన్యూవల్ కోసం అవసరమైన పత్రాలను సంబంధిత కేంద్రాల్లో సమర్పించి, సమీక్ష అనంతరం వీసా మంజూరు చేసేవారు. దీనిని సులభతరం చేసే విధానంగా "డ్రాప్‌బాక్స్ సదుపాయం" అని పిలిచేవారు. చాలా మంది వీసాదారులు ఈ సౌకర్యాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు.
ఇప్పుడు అమెరికా డ్రాప్‌బాక్స్ ప్రోగ్రామ్ ను రద్దు చేయడం వల్ల.. అన్ని కేటగిరీల దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో పిల్లలు, వృద్ధులకు కూడా ఎలాంటి మినహాయింపులు లేకుండా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందే. ఈ నిర్ణయం ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన భద్రతా చర్యల భాగంగా వస్తోంది. అధికారికంగా ఎక్కువ సెక్యూరిటీ స్క్రీనింగ్ కోసం, వీసా దరఖాస్తులో ఎటువంటి లోపం లేకున్నా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పరిశీలించే అవకాశం కలిగించడమే కొత్త రూల్స్ లక్ష్యంగా తెలుస్తోంది.
ALSO READ : 6వేల వీసాలను రద్దు చేసిన అమెరికా..
ఇప్పటికే ఉన్న వీసా తలనొప్పులతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా.. కొత్తగా వీసాల రెన్యూవల్ విషయంలోనూ నిబంధనలను యూఎస్ మార్పులు చేయటం భారతీయ వీసా హోల్డర్లను కూడా ప్రభావితం చేయనుందని తేలింది. అమెరికాకు విద్య, ఉద్యోగాల, వ్యాపార అవసరాల కోసం వెళ్లే వారితో పాటు ముఖ్యంగా H-1B వీసా కలిగిన ఐటీ ఉద్యోగులకు డ్రాప్‌బాక్స్ విధానం తొలగింపు కొత్త సమస్యలను కలిగించవచ్చని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంటున్నారు.
ఐటీ ఉద్యోగులకు వార్నింగ్..
ఇప్పటికే ఆలస్యంగా ఉన్న అమెరికా వీసా అపాయింట్మెంట్ వెయిటింగ్ టైం కొత్త నిబంధనలతో మరింతగా పెరగనుంది. H-1B వీసాలపై పనిచేస్తున్న టెక్ ఉద్యోగుల రెన్యూవల్ ఆలస్యం కావడం వల్ల అమెరికాలోని ప్రాజెక్టులు, కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోపక్క ఆగస్టు, సెప్టెంబరులో ఉన్న డ్రాప్‌బాక్స్ అపాయింట్మెంట్లను కూడా రద్దు చేసి వీసాహోల్డర్లను రెన్యూవల్ కోసం ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావాలని పిలుస్తున్నట్లు తేలింది. డ్రాప్‌బాక్స్ ప్రక్రియకు అర్హత కలిగిన వారు ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లు, వీలైతే సెప్టెంబర్ 2, 2025కు ముందు తమ వీసాలను రెన్యూవల్ ప్రక్రియ పూర్తిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం యూఎస్ ఎంబసీ, కాన్సులేట్ అధికారిక వెబ్సైట్లు చెక్ చేస్తూ.. అపాయింట్మెంట్ స్లాట్ల గురించి తాజా సమాచారం గమనించాలని అంటున్నారు.
కొన్ని మినహాయింపులు..
డ్రాప్‌బాక్స్ విధానం రద్దు అందరికీ వర్తించదని అమెరికా వెల్లడించింది. అధికారిక, దౌత్య వీసాలు కలిగిన వారికి డ్రాప్‌బాక్స్ సౌకర్యం మునుపటిలాగే కొనసాగనుంది. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోని B-1/B-2 టూరిస్ట్ లేదా బిజినెస్ వీసా రెన్యూవల్స్ కూడా మినహాయింపులో ఉండొచ్చు. కానీ అంతిమ నిర్ణయం కాన్సులర్ అధికారుల చేతిలో ఉంటుంది.