
- ఈ ఏడాది చివరలో ప్రారంభం.. 3 వేల మందికి జాబ్స్
- శాన్ ఫ్రాన్సిస్కోలో కంపెనీ ఎండీతో సీఎం రేవంత్ భేటీ
హైదరాబాద్, వెలుగు : అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ అయిన ఆమ్‌జెన్ తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరించనున్నది. హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ ఏడాది చివర నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్‌జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో కంపెనీ ఎండీ డాక్టర్ డేవిడ్ రీస్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ చటోపాధ్యాయతో సీఎం రేవంత్ రెడ్డి
ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పేరొందిన బయోటెక్ సంస్థ హైదరాబాద్‌ను తమ అభివృద్ధి కేంద్రంగా ఎంచుకోవడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. బయో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యత మరింత ఇనుమడిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచస్థాయి సాంకేతికతతో రోగులకు సేవ చేయాలని కంపెనీ ఎంచుకున్న లక్ష్యం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నదని చెప్పారు.
బయోటెక్నాలజీ రంగంలో 40 ఏండ్లుగా అగ్రగామి: డాక్టర్ రీస్
ఆమ్‌జెన్.. 40 ఏండ్లుగా బయో టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థగా గుర్తింపు సాధించిందని ఆ కంపెనీ ఎండీ డాక్టర్ రీస్ తెలిపారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కలిపి కొత్త ఆవిష్కరణలతో మరింత సేవలను అందించేందుకు ఈ సెంటర్ ఏర్పాటు అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్ లో తమ కంపెనీ విస్తరణకు సోమ్ చటోపాధ్యాయను నేషనల్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించినట్టు చెప్పారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఆమ్‌జెన్ ఇండియా హైదరాబాద్ ను కేంద్రంగా ఎంచుకోవడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. ఈ నిర్ణయం తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచస్థాయి లైఫ్ సైన్సెస్ పర్యావరణ వ్యవస్థను చాటి చెబుతుందని అన్నారు. కంపెనీ విస్తరణకు తగిన మద్దతు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు.