
హైదరాబాద్, వెలుగు: ఐటీ కంపెనీలకు ఇన్నోవేటివ్ ఇంటిగ్రేషన్ ప్రొడక్టులు, సేవలు అందించే అమెరికాకు చెందిన ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ తన ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ)ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. హైసియా ప్రెసిడెంట్ మనీషా సబూ ఈ సెంటర్‌ను గురువారం ప్రారంభించారు. దేశంలో తమ సబ్సిడరీని విస్తరిస్తున్నామని ఇన్ఫోవ్యూ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఆగ్నేయాసియా, లోకల్ సంస్థలకు సేవలను అందించడానికి ఈ సెంటర్ సాయపడుతుందని తెలిపింది. ఐడీసీ లాంచ్ సందర్భంగా సంస్థ సీటీవో సత్య శేఖర్ దాస్ మండల్ మాట్లాడుతూ, ఈ సెంటర్ ప్రపంచంలోని రెండు అతిపెద్ద సైట్లలో ఒకటని అన్నారు. తమకు 80 మందికి పైగా భారతీయ క్లయింట్లు ఉన్నారని, ఇది వరకు మ్యూల్ సాఫ్ట్, కాన్ ఫ్లుయెంట్, ఐబీఎం, ఇతర ప్రముఖ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌తో కలిసి పనిచేశామని వివరించారు. 2020 లో ఏర్పాటైన ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ ఇంక్ సబ్సిడరీ. హెల్త్ కేర్, డిస్ట్రిబ్యూషన్, మాన్యుఫాక్చరింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, వేస్ట్ మేనేజ్ మెంట్, ప్రభుత్వ సర్వీసులతో సహా అన్ని రకాల సెక్టార్లకు సిస్టమ్స్ ఇంటిగ్రేషన్స్, క్వాలిటీ టెస్టింగ్, ఈ-–కామర్స్, మొబైల్, డేటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఐఓటీ లాంటి డిజిటల్ టెక్నాలజీ సర్వీస్‌లను ఈ కంపెనీ అందిస్తోంది.