Tax Filing: ఇంకా వారమే డెడ్‌లైన్.. టాక్స్ ఫైలింగ్‌లో ఈ 5 తప్పులు అస్సలు చేయెుద్దు..

Tax Filing: ఇంకా వారమే డెడ్‌లైన్.. టాక్స్ ఫైలింగ్‌లో ఈ 5 తప్పులు అస్సలు చేయెుద్దు..

ITR Filing Mistakes: దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల కోసం ఇచ్చిన టాక్స్ ఫైలింగ్ గడువు మరో వారంలో పూర్తి కాబోతోంది. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా ఈ ఏడాది పన్ను శాఖ జూలై 31గా ఉన్న వాస్తవ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే యుటిలిటీస్ ఆలస్యంగా విడుదల చేయటం వల్ల గడువు మరింతగా పొడిగించాలంటూ ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FKCCI), చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ సూరత్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ను కోరుతున్నారు. దీనికి తోడు పోర్టల్ నెమ్మదిగా ఉందని వారు చెబుతున్నారు. అయితే గడువు దగ్గర పడుతున్న వేళ చాలా మంది ఈ హడావిడిలో చేసే కొన్ని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

* ఆఖరి రోజుల్లో ఐటీఆర్ ఫైలింగ్ చేసే చాలా మంది పన్ను చెల్లింపుదారులు సరైన ఐటీఆర్ ఫారమ్ ఎంపికలో పొరపాట్లు చేస్తుంటారని సీఏలు హెచ్చరిస్తున్నారు. తప్పుడు ఫారమ్ పూరించటం వల్ల ప్రాసెసింగ్ సమయంలో సమస్యలు కొన్ని సార్లు నోటీసులు వచ్చే ప్రమాదం ఉంటుంది. 

ALSO READ : షాకింగ్ ర్యాలీ.. రూ.లక్షా 10వేలు దాటేసిన తులం 24K గోల్డ్..

* కొందరు తమ ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో విదేశాల్లో ఉన్న ఆస్తులు, అక్కడి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు లేదా పెట్టుబడులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అయితే విదేశీ ఆస్తులను డిస్ క్లోజ్ చేయటంలో ఏవైనా దాచిపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే హెచ్చరించింది. 

* కొందరు ఉద్యోగులు ఒక కంపెనీలో పనిచేస్తూ యజమానికి తెలియకుండా మరో చోట కూడా ఉద్యోగం చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో సదరు వ్యక్తి ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు ఇద్దరు యజమానుల నుంచి ఫారమ్ 16 ఆదాయాన్ని చూపాల్సి ఉంటుంది. ఆదాయాన్ని దాచిపెట్టడం లేదా తక్కువ చూపడాన్ని అధికారులు గుర్తిస్తే భారీ పెనాల్టీలు చెల్లించుకోవాల్సి ఉంటుందని అకౌంటెంట్లు హెచ్చరిస్తున్నారు. 

* చాలా మంది ఉద్యోగుల్లో గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యూటెడ్ పెన్షన్ వంటి ఆదాయాన్ని చూపక్కర్లేదని అపోహ ఉంటుంది.  కానీ ఇలాంటి మినహాయింపుల వివరాలు తప్పక అందించాలని అప్పుడే సెక్షన్ 10 కింద వాటిని క్లెయిమ్ చేయటానికి వీలుంటుందని గుర్తించాలి. అలాగే దాచిపెట్టిన ఆదాయానికి సంబంధించిన మార్గాల గురించి కూడా వివరణ కోరుతూ ఐటీ అధికారులు నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. 

* ఇక చివరిగా పన్ను చెల్లింపుదారులు అందించిన యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, టాక్స్ ఇన్ఫర్మెషన్ స్టేట్మెంట్ వివరాలు రికార్డులతో సరిపోలేలా ఉండాలని గమనించాలి.