దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గడిచిన 24గంటల్లోనే 841 కొత్త కొవిడ్ -19 కేసులు నమోదు కాగా.. కేరళ, కర్ణాటక, బీహార్‌లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇది గత 227 రోజులు లేదా ఏడు నెలల్లో అత్యధిక రోజువారీ పెరుగుదలను సూచిస్తుంది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 3,997 నుండి 4,309కి పెరిగింది.
అంతకుముందు అంటే డిసెంబర్ 30న భారతదేశంలో 743 కొవిడ్ -19 కేసులు, ఏడు మరణాలు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా సూచించింది. జనవరి 2020లో కొవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుండి, దేశంలో 4.50 కోట్ల (4,50,13,272) కేసులు, 5,33,361 మరణాలు నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో కేసుల పెరుగుదల ఉన్నప్పటికీ, రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా.. 4.44 కోట్ల (4,44,75,602) మంది ప్రజలు అనారోగ్యం నుండి కోలుకున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రచారంలో భాగంగా దేశం 220.67 కోట్ల డోస్‌ల కొవిడ్ -19 వ్యాక్సిన్‌లను అందించింది.
