
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఎల్ఐసీ మెగా ఐపీఓ కొంత కాలం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. సరయిన విలువను రాబట్టుకునేందుకే ఎల్ఐసీ మెగా ఐపీఓను వాయిదా వేయాలనుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అటు గ్లోబల్ మార్కెట్లు, ఇటు దేశీయ మార్కెట్లు పడుతున్నాయి. ఇలాంటి టైము ఎల్ఐసీ లాంటి మెగా ఐపీఓకు సరయినది కాదని ప్రభుత్వం ఆలోచిస్తోంది. గ్లోబల్ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా ఇప్పటికే సూచించారు. ఎల్ఐసీ ఐపీఓను ముందుకు తీసుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నిర్మల చెప్పారు. గ్లోబల్ పరిస్థితుల ప్రకారం ఎల్ఐసీ ఐపీఓ ప్లాన్‌ను మరోసారి పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోందని పేర్కొన్నారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమైతే ఎల్ఐసీ ఐపీఓ ఈ నెలలో ఉండాలి. ఎల్ఐసీలో 5 శాతం వాటా అమ్మి రూ. 63 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌కు పెట్టుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ టార్గెట్‌ను ప్రభుత్వం అందుకోవడానికి ఎల్ఐసీ ఐపీఓ కీలకంగా మారింది. ఒకవేళ ఈ ఐపీఓ వాయిదా పడితే ప్రభుత్వం తన టార్గెట్ మిస్ అవుతుంది.