వడ్లు కొనకుంటే రైతులు నష్టపోయే ప్రమాదం

వడ్లు కొనకుంటే రైతులు నష్టపోయే ప్రమాదం

హైదరాబాద్, వెలుగు: యాసంగి వడ్లు ఎవరు కొంటారో స్పష్టత లేకపోవడంతో ఎంఎస్పీ కంటే తక్కువకే అమ్ముకుని రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర సర్కార్ వడ్ల కొనుగోళ్లు చేపట్టబోమని చెప్పడం, కేంద్రం రా రైస్ తీసుకుంటామని తెలియజేయడంతో మిల్లర్లు, దళారులు ఎంటరై రైతులను అందిన కాడికి దోచుకుంటారని పేర్కొంది. ఇదే జరిగితే క్వింటా వడ్లకు కనీసం రూ.400 నుంచి రూ.600 దాకా నష్టపోతారని తెలిపింది. జయశంకర్​ వర్సిటీకి చెందిన మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వింగ్.. పంటలకు వచ్చే ధరలపై ముందస్తు అంచనాల రిపోర్ట్‌‌‌‌ను రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌కు అందజేసింది. ఇందులో దేశవ్యాప్తంగా వరి సాగు, ఉత్పత్తి, మార్కెట్ ధరలు, ఎగుమతులు, ప్రపంచ మార్కెట్ వంటి వాటిని బేరీజు వేసింది. దేశంలో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎంఎస్పీ కంటే తక్కువ ధరనే మిల్లర్లు, ట్రేడర్స్ చెల్లిస్తారని పేర్కొంది. సాధారణ రకం వడ్లకు కేంద్రం క్వింటా వరికి మద్దతు ధర రూ.1,940, గ్రేడ్ ఏకు రూ.1,960 ప్రకటించింది. అయితే అంతకంటే తక్కువకే పంట అమ్ముడుపోయే అవకాశం ఉందని, ఫలితంగా రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని వ్యవసాయ వర్సిటీ హెచ్చరించింది.

గిట్టుబాటు కష్టమే
ఫిబ్రవరి చివరి వారంలో సూర్యాపేట మార్కెట్‌‌‌‌కు వచ్చిన సాధారణ రకం వడ్లకు క్వింటాలుకు కనీస ధర రూ.1,400 ఉండగా, ఎక్కువగా రూ.1,650 లోపే వచ్చినట్లు వ్యవసాయ వర్సిటీ తన రిపోర్టులో వెల్లడించింది. వడ్లను దళారులు, మిల్లర్లు కొనుగోలు చేస్తే రవాణా, హమాలీ చార్జీలు కూడా రైతులపైనే వేస్తారు. దీంతో రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉండదని పేర్కొంది. ఈ సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా రైతులు 36 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. 83 లక్షల టన్నుల వడ్లు పండుతాయని ఆఫీసర్లు అంచనా వేస్తున్నరు. ఈ నెలలోనే పంట కోతలు మొదలుకానున్నాయి. ఇప్పటికే వానాకాలంలో అనుకున్నంతగా వడ్ల సేకరణ రాష్ట్ర సర్కార్​ చేపట్టలేదు. ఇప్పుడు రబీలో చేయబోమని చెబుతోంది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

తగ్గిన సాగు
గడిచిన యాసంగితో పోలిస్తే రాష్ట్రంలో వరి సాగు తగ్గింది. గత ఏడాది 52 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ఇప్పుడు అందులో 16 లక్షల ఎకరాల సాగు తగ్గింది. అయితే ఈ స్థాయిలోనూ సాగు కావొద్దని రాష్ట్ర సర్కార్​ అనుకున్నది. అయినా రైతులు ఏ పంట వేయాలో తెలియక ఎప్పటిలాగే వరి వేసుకున్నరు. అదే దేశవ్యాప్తంగా చూస్తే ఈసారి 12.5 కోట్ల టన్నుల బియ్యం వస్తుందని వ్యవసాయ వర్సిటీ అంచనా వేసింది. గతేడాది ఇది 12.2 కోట్ల టన్నులుగా ఉంది. వరి ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా, ఇండియా రెండో స్థానంలో ఉంది.