
ప్రపంచంలో అనేక దేశాలను ఆర్థికంగా, వాణిజ్యంగా, రాజకీయంగా పతనం చేసి మెుదటి స్థానంలో ఉండటమే గ్రేట్ అమెరికన్ రాజకీయం. మాట వినని వాళ్లపై ఆంక్షలు, సైనిక చర్యలు అంటూ నాశనం చేయటం పెద్దన్నకు వెన్నతో పెట్టిన విద్యని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. రష్యాతో వ్యాపారం వద్దంటూ ఇండియాపై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. తాను రష్యాతో చేస్తున్న బిజినెస్ గురించి మాత్రం బయటపెడ్డటం లేదు. ఒక్కసారి నిజమైన లెక్కలు చూస్తే ట్రంప్ డబుల్ గేమ్ గురించి ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్లు తెలుస్తుంది.
గతవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. ఆ సమయంలోనే రష్యా నుంచి మిలిటరీ ఆయుధాలు, క్రూడ్ ఆయిల్ కొనుగోలు మానుకోవాలని హెచ్చరిస్తూ పెనాల్టీ విధిస్తానని చెప్పారు. తాము రష్యాతో ఎలాంటి వ్యాపారం చేయటం లేదంటున్న ట్రంప్ పూర్తిగా ప్రపంచానికి అబద్ధాలు చెబుతున్నట్లు ట్రేడ్ గణాంకాలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో యూరోపియన్ యూనియన్ కూడా రష్యాతో వ్యాపారం కొనసాగిస్తున్న విషయం బయటపడింది.
ALSO READ : రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకుంటే.. ఇండియాపై మరిన్ని టారిఫ్లు
తాము రష్యాతో వ్యాపారం కొనసాగిస్తున్నప్పటికీ అమెరికా, ఈయూ ఇతర దేశాలను వ్యాపారం మానుకోవాలంటున్నాయి. దీనిపై బదులిచ్చిన భారత్ దేశ ఆర్థిక భద్రత, జాతి ప్రాధాన్యతలను రక్షించుకునేందుకు తమకు నచ్చిన వాళ్లతో వ్యాపారం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు విదేశాంగ మంత్రి జై శంకర్. రష్యాపై ఆంక్షల తర్వాత ఎనర్జీ భద్రత కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను అప్పట్లో అమెరికా సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ప్రెసిడెంట్ మారగానే ప్లేటు మార్చేసింది అమెరికా. వాస్తవానికి రష్యా నుంచి చేసుకుంటున్న చమురు దిగుమతుల కారణంగా ఏడాదికి ఇండియాకు దాదాపు రూ.లక్ష కోట్ల వరకు దిగుమతుల భారం తగ్గుతోంది.
అమెరికా రష్యాతో చేస్తున్న వ్యాపారం..
కుటిల నీతిని అనుసరిస్తున్న అమెరికా రష్యా నుంచి అణు పరిశ్రమకోసం యురేనియం హెక్సా ఫ్లోరైడ్, ఈవీ రంగం కోసం పల్లాడియం, వ్యవసాయానికి అవసరమైన ఫెర్టిలైజర్స్, కీలక కెమికల్స్, యంత్రాలు, చెక్కను దిగుమతి చేసుకుంటోంది. 2024లో రష్యా నుంచి అమెరికా 3.5 బిలియన్ డాలర్లు విలువైన దిగుమతులు చేసుకుంది. ఈ కాలంలో 526 మిలియన్ డాలర్ల ఎగుమతులను రష్యాకు పంపింది అమెరికా. ఇక 2025లో ఇప్పటి వరకు రష్యా నుంచి అమెరికా దిగుమతులు 2 బిలియన్ డాలర్లను దాటిపోగా.. 232 మిలియన్ డాలర్ల ఎగుమతులు కూడా చేసింది అమెరికా.
ఇండియా- అమెరికా వ్యాపారం..
వాస్తవానికి వ్యాపార పరంగా అమెరికా మార్కెట్ ఇండియాకు చాలా కీలకమైనది. ఈ రెండు దేశాల మధ్య వ్యాపారం 2024-25లో 186 డాలర్లకు చేరుకుంది. ఇందులో భారత్ వస్తు ఎగుమతులు అమెరికాకు 86 బిలియన్ డాలర్లకు పైగా ఉండగా.. అమెరికా నుంచి వస్తు దిగుమతులు 45 బిలయన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక సేవారంగం ఎగుమతులు 29 బిలియన్ డాలర్లు ఉండగా.. యూఎస్ నుంచి దిగుమతులు సేవల రంగంలో 26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా ఇండియా ఫార్మా, టెలికాం, పెట్రోలియం ఉత్పత్తులు, జ్యూవలెరీ అండ్ జెమ్స్, గార్మెంట్స్, ఆటో పార్స్ ఎగుమతులను అమెరికాకు పంపుతోంది.
దాదాపు 5 రౌండ్ల చర్చల తర్వాత కూడా అమెరికా ఇండియా మధ్య ట్రేడ్ డీల్ ఫైనల్ కాకపోవటం ట్రంప్ ని నిరుత్సాహపరిచిందని నిపుణులు అంటున్నారు. అమెరికా చెప్పినట్లు డెయిరీ ఉత్పత్తులు, జీన్ మాడిఫైడ్ అగ్రి ఉత్పత్తుల దిగుమతులను ఇండియా ఒప్పుకోకపోవటంపై అమెరికా ఆగ్రహంగా ఉందని వారు అంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ద-ృష్టిలో ఉంచుకుని ఒకపక్క ఇండియా ఈ వస్తువులను అమెరికా నుంచి దిగుమతిని నిరాకరిస్తుండగా.. ట్రంప్ మాత్రం నయానో భయానో ఇండియాను తన దారికి తెచ్చుకోవటానికి ఒత్తిడి చేస్తున్నారు. ఈక్రమంలోనే గతవారం 25 శాతం సుంకాల తర్వాత మళ్లీ ఇప్పుడు రష్యా దిగుమతులపై అదనపు సుంకాలను ప్రకటిస్తామని హెచ్చరించినట్లు నిపుణులు అంటున్నారు. తమ అవసారల కోసమే రష్యన్ ఆయిల్ కొంటున్నామని భారత్ చెప్పినప్పటికీ యూఎస్ వితండవాదం చేస్తోంది. జూలై ఒక్క నెలలోనే భారత్ మెుత్తం క్రూడ్ అవసరాల్లో 36 శాతం రష్యా నుంచి వచ్చాయి.