అమీన్​పూర్ కొత్త చెరువు అలుగు ఆక్రమణ

అమీన్​పూర్ కొత్త చెరువు అలుగు ఆక్రమణ

హైదరాబాద్, వెలుగు : అమీన్​పూర్ కొత్త చెరువు అలుగును లలిత కన్​స్ట్రక్షన్స్​సంస్థ ఆక్రమిస్తోందని స్థానిక కృష్ణ బృందావన్​కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు తమ కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త చెరువు నిండి పూర్తిస్థాయిలో అలుగు పారితే, ఆ నీరు నాలా గుండా బంధంకొమ్ము చెరువు వరకు వెళ్తుంది. సర్వే నంబర్​343/3లోని ప్రభుత్వ భూమి మీదుగా అలుగు నాలా ఉంది.

అయితే లలిత కన్ స్ట్రక్షన్స్ సంస్థ అలుగు నాలాను ఆక్రమించి, దానిపై భారీ పైపులు వేసి, రోడ్డు నిర్మిస్తోందని కృష్ణ బృందావన్​కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. పైపులు, రోడ్డు నిర్మాణం కారణంగా చెరువు అలుగు పారిన సమయంలో ఓట్ ఫ్లో తగ్గి, తమ కాలనీని వరద ముంచెత్తుతుందని వాపోతున్నారు.

పైపులు వేసేందుకు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతి పొందలేదని, అక్రమంగా రోడ్డు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణను ఆపాలని కృష్ణ బృందావన్​కాలనీవాసులు కోరుతున్నారు.