శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ ... మన ​ఎదుగుదలకు సంకేతం

శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ ... మన ​ఎదుగుదలకు సంకేతం

అహ్మదాబాద్: 75 ఏండ్ల స్వతంత్ర భారత అమృత కాలంలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుండటం కాకతాళీయం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. వచ్చే 25 ఏండ్లలో ప్రపంచంలో భారత్​ఎదుగుదలకు ఇది ప్రకృతి సంకేతమని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఆయన గుజరాత్​లోని ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘రాముడు జన్మించిన పవిత్ర స్థలం 550 ఏండ్ల క్రితం ధ్వంసమైతే.. చాలా సంవత్సరాలుగా దేశం పునర్నిర్మించలేకపోయింది. అప్పటి సంస్కృతిని తిరిగి తెచ్చేందుకు సాధువులు సహా దేశంలో ఎంతోమంది ప్రయత్నించినా కుదరలేదు. పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సాధువుల ఆశీస్సులు, స్ఫూర్తితో అన్ని దారులు తెరుచుకున్నాయి. 

జనవరి 22న శ్రీరాముడు తన కోవెలలో కొలువుదీరబోతున్నాడు” అని షా అన్నారు. మన యోగా, ఆయుర్వేదం సర్వత్రా ఆమోదం పొందుతున్న ఈ సమయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగడం  ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూస్తోందన్నారు. మన వేదాలు, ఉపనిషత్తులు, తత్వశాస్త్రం శాస్త్రీయ దృక్కోణాలను అర్థం చేసుకోవడానికి ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఉందన్నారు. ఔరంగజేబు కూల్చివేసిన కాశీ విశ్వనాథ దేవాలయాన్ని, ఉజ్జయినిలో మహాకాల్ లోక్ కారిడార్‌ను, భద్రిధామ్, కేదార్​ధామ్‌లోని ఆలయాలను, సోమనాథ్, గుజరాత్‌లోని పావగఢ్‌లో శక్తి పీఠాన్ని మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని షా గుర్తుచేశారు. 

మోదీ నాయకత్వం దేశ ఆత్మను మేల్కొల్పేందుకు కృషి చేసిందన్నారు. ఆధ్యాత్మికత నుంచి ఆయుర్వేదం వరకు, సాంఘిక శాస్త్రం నుంచి సోలార్‌ వరకు, గణితం నుంచి మెటావర్స్‌ వరకు, సున్నా నుంచి అంతరిక్షం వరకు ప్రపంచంలోని ప్రతిచోటా భారత్‌ ఆధిపత్యాన్ని మనం చూస్తున్నామని చెప్పారు. ‘‘చంద్రునిపై చంద్రయాన్‌ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ స్పాట్‌గా మోదీ పేరు పెట్టారు. ఇంత భారీ జనాభా, కొంత బలహీనమైన ప్రజారోగ్య సంరక్షణ ఉన్న దేశం గురించి ప్రపంచ నిపుణులు ఆందోళన చెందారు. అయినా, కరోనా మహమ్మారిపై విజయవంతంగా మోదీ ప్రభుత్వం పోరాడింది” అని అమిత్​షా అన్నారు.