కేసీఆర్.. ప్రధాని సీటు ఖాళీగా లేదు.. సీఎం సీటు కాపాడుకో

కేసీఆర్..  ప్రధాని సీటు ఖాళీగా లేదు.. సీఎం సీటు కాపాడుకో

చేవెళ్ల సభ వేదికగా కేంద్రమంత్రి అమిత్ షా బీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.  ప్రధాని కావాలని సీఎం కేసీఆర్ కలలు కంటున్నారు కానీ  ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీగా లేదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించుకోవాలని సూచించారు. 

వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందని, దేశానికి  ప్రధానిగా మోడీనే బాధ్యతలు చేపడుతారని తెలిపారు.  కేసీఆర్ ముందు తన సీఎం సీటు కాపాడుకుంటే చాలని చెప్పారు.  బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్‌ దేశమంతా విస్తరించాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.  

కేసీఆర్ ను గద్దే దించే వరకు తమ పోరాటం ఆగదన్న అమిత్ షా.. సీఎం కేసీఆర్ ఏం చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి  వస్తోందని  జోస్యం చెప్పారు.   ప్రజలు తమ వైపే ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి సర్కార్ నడుస్తోందన్న అమిత్  షా.. కేసీఆర్ సర్కార్ పనితీరును దేశం  మొత్తం చూస్తోందని చెప్పారు. ఒవైసీ అజెండాపై సీఎం  కేసీఆర్  పనిచేస్తున్నారన్న అమిత్ షా.. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. 

మజ్లిస్ అంటే  తమకు భయం లేదని  అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్ తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  అటు ఇదే వేదికపై అమిత్ షా... సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు. వాటిని  ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామని చెప్పారు.