రాజీవ్ గాంధీ ఫౌండేషన్​కు చైనా నుంచి రూ.1.34 కోట్లు : అమిత్ షా

రాజీవ్ గాంధీ ఫౌండేషన్​కు చైనా నుంచి రూ.1.34 కోట్లు : అమిత్ షా
  • మోడీ సర్కార్ ఉన్నంతకాలం అట్ల జరగదు: అమిత్ షా 
  • రూల్స్​కు విరుద్ధంగా డబ్బు అందడంతో ఎఫ్​సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దు 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం మన భూమిని ఎవరూ ఇంచు కూడా ఆక్రమించలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ‘‘ఆక్రమణలను మా ప్రభుత్వం సహించదు. ఇంచు భూమిని కూడా వదిలిపెట్టం. మన సైనికుల ధైర్యసాహసాలు ప్రశంసనీయం. వాళ్లు మన భూమిని కాపాడారు” అని చెప్పారు. మంగళవారం పార్లమెంట్ బయట అమిత్ షా మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో క్వశ్చన్ అవర్​ను కావాలనే కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు సంబంధించి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్ సీఆర్ఏ) రిజిస్ట్రేషన్ రద్దు గురించి ప్రస్తావనే రాకూడదనే సరిహద్దు అంశాన్ని లేవనెత్తి సభను అడ్డుకుందని ఫైర్ అయ్యారు. 2005 నుంచి 2007 మధ్య చైనా ఎంబసీ నుంచి ఆర్ జీఎఫ్ కు రూ.1.35 కోట్లు అందాయని తెలిపారు. చైనా, ఇండియా మధ్య రిలేషన్స్ కు సంబంధించి పరిశోధనకు గాను ఈ డబ్బులు పొందిందని చెప్పారు. సోషల్ వర్క్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థ.. నిబంధనలకు విరుద్ధంగా చైనా నుంచి డబ్బులు పొందిందని, అందుకే రిజిస్ట్రేషన్ రద్దు చేశామని స్పష్టం చేశారు. ఆర్ జీఎఫ్ కు ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ జాకీర్ నాయక్ నుంచి కూడా రూ.50 లక్షలు అందాయని తెలిపారు. టెర్రరిస్టులతో సంబంధాలు ఉండటంతో ఈ సంస్థను గతంలోనే బ్యాన్ చేసినట్లు చెప్పారు. 

నెహ్రూ వల్లే యూఎన్ఎస్సీలో శాశ్వత సభ్యత్వం రాలే..

చైనాపై జవహర్ లాల్​ నెహ్రూకు ఉన్న ప్రేమ కారణంగానే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్​(యూఎన్ఎస్సీ)లో శాశ్వత సభ్యత్వాన్ని మన దేశం కోల్పోవాల్సి వచ్చిందని అమిత్ షా కామెంట్ చేశారు. కాంగ్రెస్ లీడర్లకు విదేశీ లీడర్లతో ఉన్న పర్సనల్ రిలేషన్ షిప్ కారణంగా యూఎన్ఎస్​సీలో శాశ్వత సభ్యత్వాన్ని త్యాగం చేశారని తెలిపారు. ‘‘చైనా ఎంబసీ నుంచి డబ్బులు తీసుకున్న ఆర్ జీఎఫ్ ఇప్పటికే రీసెర్చ్ చేసి ఉంటుంది. 1962లో వేలాది ఎకరాల మన భూమిని చైనా ఆక్రమించుకుంది. మరి ఈ అంశాన్ని అందులో చేర్చారా? ఒకవేళ రీసెర్చ్ చేస్తే ఎలాంటి రిజల్ట్ వచ్చింది?” అని ప్రశ్నించారు. యూఎన్ ఎస్ సీలో మన దేశానికి రావాల్సిన శాశ్వత సభ్యత్వాన్ని నెహ్రూ త్యాగం చేయడం, అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం దోర్జీ ఖండూకు వీసాను చైనా నిరాకరించడం, జమ్మూకాశ్మీర్ ప్రజలకు స్టాపుల్ వీసాలు జారీ చేయడంపైనా కాంగ్రెస్ పరిశోధనలు చేస్తుందా? అని ప్రశ్నించారు.