కేసీఆర్‌‌‌‌ది హామీలు ఇచ్చే కంపెనీ

కేసీఆర్‌‌‌‌ది హామీలు ఇచ్చే కంపెనీ
  • కేసీఆర్ అవినీతి సర్కార్‌‌‌‌ను పెకిలిద్దాం
  • మునుగోడు సభలో కేంద్ర మంత్రి అమిత్ షా


కేసీఆర్‌‌‌‌ది హామీలు ఇచ్చే కంపెనీ.. తెలంగాణలోని ప్రతి నిరుద్యోగికి రూ.3 వేలు ఇస్తామని చెప్పిండు. మరి అవి అందుతున్నయా? ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తానని చెప్పిండు. నల్గొండలో ప్రారంభించిండా? పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లన్నడు.. వచ్చినయా? ఈటల రాజేందర్‌‌‌‌ను ఉప ఎన్నికల్లో ఓడించేందుకు ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తానని అన్నడు.. ఇచ్చిండా? ప్రతి దళితుడికి మూడు ఎకరాల భూమి అన్నడు.. ఇచ్చిండా? తెలంగాణ వస్తే దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పిండు.. ఇప్పటివరకు చేయలేదు.. మళ్లీ గెలిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ సీఎం అవుతాడు. కానీ దళితుడిని మాత్రం ముఖ్యమంత్రిని చేయడు. మునుగోడు సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

హైదరాబాద్/ నల్గొండ, వెలుగు:  రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి సర్కార్‌‌‌‌ను కూకటివేళ్లతో పెకిలించాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో రానున్నది మోడీ నేతృత్వంలోని సర్కారే. ఇందుకోసం ముందుగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి..” అని ఆయన కోరారు. బీజేపీలోకి రాజగోపాల్ చేరిక.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకేనన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని, ఆయన కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం తెలంగాణకు రూ. రెండు లక్షల కోట్ల నిధులిచ్చినా రాష్ట్రం ఇంకా అప్పుల్లో ఉందని, అందుకే టీఆర్ఎస్‌‌ను గద్దె దించాలని, మోడీ నేతృత్వంలోని సర్కారుతోనే తెలంగాణ వికాసం సాధ్యమవుతుందని అన్నారు. ఆదివారం మునుగోడులో నిర్వహించిన ‘బీజేపీ సమర భేరి’ సభలో అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి బీజేపీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి షా ఆహ్వానించారు.  అనంతరం అమిత్ ​షా మాట్లాడుతూ.. రాజగోపాల్‌‌ను ఉప ఎన్నికల్లో గెలిపిస్తే కేసీఆర్ అవినీతి సర్కార్ అంతమవుతుందని, దానికి తాను గ్యారంటీ ఇస్తున్నానని చెప్పారు. కేసీఆర్ అండ్ కంపెనీ కేవలం హామీలు మాత్రమే ఇస్తుందని, వాటిని ఆచరణలో పెట్టదని విమర్శించారు.

రైతు వ్యతిరేకి కేసీఆర్

‘‘కేసీఆర్ 2014 నుంచి ఏ ఒక్కరికీ ఉపాధి ఇవ్వలేదు.. తన కుటుంబంలోనే ఉపాధి ఇచ్చుకుంటున్నడు. కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు.. ఇలా కేసీఆర్ కుటుంబం చాలా పెద్దదని నాకు తెలుసు. అందుకు నాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఆయన కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్నది’’ అని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ రైతు వ్యతిరేకి అని మండిపడ్డారు. తాము ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొస్తే దానికి రైతుల్ని దూరం పెట్టారని, కనీస మద్దతు ధరతో పంటలు కొనుగోలు చేయాలన్నా చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత రైతుల నుంచి ప్రతి కిలో ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. 

పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న కేసీఆర్, అవి ఇవ్వకపోగా కేంద్రం ఇస్తున్న టాయిలెట్లకూ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, ఇన్నేళ్లయినా చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను గెలిపిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తారు తప్ప దళితులను గద్దెనెక్కించరని గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి రూ.3 వేలు ఇస్తామని చెప్పారని, మరి అవి అందుతున్నాయా అని సభికుల ను ఉద్దేశించి అడిగారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషల్ హాస్పిటల్ ప్రారంభిస్తానని చెప్పారని, నల్గొండలో ప్రారంభించారా అని ప్రశ్నించారు. పేదలకు డబుల్​ బెడ్రూం ఇండ్లన్నారు, దళితుడికి 3ఎకరాల భూమి అన్నారు ఇచ్చారా అని అడిగారు.

రాష్ట్రంలోనే పెట్రోల్ రేట్లు ఎక్కువ

‘‘పెట్రోల్ రేట్లను మోడీ ప్రభుత్వం.. రెండు సార్లు తగ్గించింది. కానీ కేసీఆర్ ఒక్క పైసా తగ్గించలేదు. ఇక్కడే ధరలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణనే’’ అని అమిత్ షా విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూడా కేసీఆర్ అడ్డుపడ్డారని ఫైర్ అయ్యారు. ‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవం జరుపుతామని కేసీఆర్ చెప్పారు. కానీ మజ్లిస్‌‌‌‌‌‌‌‌కు భయపడి.. విమోచన దినం జరపడం లేదు. రాష్ట్ర ప్రజలు చింతించొద్దు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీఎం వస్తారు. ఆయన నేతృత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుతాం’’ అని చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించడానికే రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి బీజేపీలో చేరారని, అందుకే ఆయన్ను గెలిపించాలని మునుగోడు ప్రజలను కోరారు. అమిత్​ షా తన ప్రసంగం చివరలో ప్రజలను ఉద్దేశించి ‘‘మోడీకి సహకరిస్తారా, ఆయనకు అండగా ఉంటారా, తెలంగాణలో బీజేపీ సర్కారును ఏర్పరుస్తారా’ అని అడిగారు. తెలంగాణలో కమలాన్ని వికసింపజేస్తామని రెండు చేతులు ఎత్తి విజయ సంకల్ప పిడికిలి బిగించమని పిలుపునిచ్చారు. 

రాజగోపాల్ రాజీనామాతో కేసీఆర్ బయటికొచ్చిండు

ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో నిద్రపోతున్న సీఎంను బయటకు తీసుకొచ్చింది రాజగోపాల్ రెడ్డి. ఆయన రాజీనామాతోనే సీఎం మునుగోడు బాటపట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం నేను, రాజగోపాల్ లాంటి వాళ్లంతా పార్లమెంట్ వేదికగా పోరాడాం. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నం. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం కళ్లు మూసుకుంటే రాజగోపాల్ తన సొంత ఖర్చులతో నియోజకవర్గ ప్రజలకు సేవలు చేశారు. అలాంటి రాజగోపాల్​రెడ్డిని గెలిపించుకోవాలి.  తెలంగాణలోనూ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..

వివేక్ వెంకటస్వామి, 
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు

రాష్ట్రాన్ని కాపాడుకుందాం

కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణను, ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మునుగోడు ప్రజలు నాతో కలిసి రావాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేనన్న ఒకే ఒక్క కారణంతో ఫండ్స్ ఇవ్వకుండా మునుగోడు అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇప్పుడు నా రాజీనామాతో కేసీఆర్ ​పరుగెత్తుకుంటూ మునుగోడు వచ్చారు. రాజీనామాతోనే ఏండ్లుగా అడుగుతున్న గట్టుప్పల్ ​మం డలాన్ని ఇచ్చారు. 57 ఏండ్ల వారికి పిం ఛన్లు, ఇతర స్కీములు పంచు తున్నారు. మునుగోడు ప్రజలపై నమ్మ కంతోనే తాను ముందుకు పోతున్నా. 

- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి