- రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నదని వెల్లడి
- మేం అధికారంలోకి రాగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను ఏరిపారేస్తామని హెచ్చరిక
- రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నది
- మేం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను ఏరిపారేస్తం
- సరిహద్దుల్లో అత్యంత శక్తివంతమైన 'నేషనల్ గ్రిడ్' ఏర్పాటు చేస్తం
- బెంగాల్‌లో మహిళలకు భద్రత లేదని హోంమంత్రి కామెంట్
కోల్‌కతా: రాజకీయ ప్రయోజనాల కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నదని, ఉగ్ర నెట్‌వర్క్‌లు విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కోల్‌కతాలో అమిత్ షా మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఓటు బ్యాంకు కోసమే మమతా బెనర్జీ అక్రమ వలసలకు మద్దతుగా నిలుస్తున్నారని విమర్శించారు. మమతా బెనర్జీ15 ఏండ్ల పాలనలో రాష్ట్రం అవినీతి, భయం, చొరబాట్లతో నిండిపోయిందని ఆరోపించారు. సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడంలేదని, అందుకే ఈ సమస్య ఇంకా కొనసాగుతోందని అన్నారు.
అస్సాం, రాజస్తాన్ లాంటి రాష్ట్రాల్లో లేని సమస్య బెంగాల్‌లోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర భద్రతకు ఈ అంశాలు తీవ్ర ముప్పుగా పరిణమించాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. కేవలం దేశభక్తి గల బీజేపీ ప్రభుత్వం మాత్రమే సరిహద్దులను కాపాడి, చొరబాటుదారులను బయటకు తరిమికొడుతుందని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తో మతువా కమ్యూనిటీకి ఎలాంటి అన్యాయం జరగదని చెప్పారు.
బెంగాల్‌లో అధికారంలోకి వస్తం..
బెంగాల్‌లో మహిళలకు భద్రత లేదని, ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, సందేశ్‌ఖాలీ ఘటనలే దీనికి సాక్ష్యమని అమిత్ షా పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అవినీతికి మారుపేరుగా మారిందని, ఆ పార్టీ నేతల ఇళ్లలో దొరికిన నగదును లెక్కించడానికి యంత్రాలు కూడా మొరాయిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని, 7 వేలకు పైగా పరిశ్రమలు ఇక్కడి నుంచి పారిపోయాయని పేర్కొన్నారు.
కమ్యూనిస్టులు ఓడిపోయిన తర్వాత హింస, ప్రతీకార రాజకీయాలు ముగుస్తాయని అనుకున్నారని, కానీ టీఎంసీ పాలనలో 300 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు. 3 వేల మందికి పైగా బీజేపీ కార్యకర్తలు ఇప్పటికీ వారి ఇళ్లకు తిరిగి రాలేకపోయారని, టీఎంసీ జెండాను మోస్తేనే వారిని అక్కడికి అనుమతించాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
ఏప్రిల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండొంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తుందని, ఏప్రిల్ 15 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో అత్యంత శక్తివంతమైన ‘నేషనల్ గ్రిడ్’ను ఏర్పాటు చేస్తామని, కనీసం ఒక పక్షి కూడా సరిహద్దు దాటలేనంత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని చొరబాటుదారులను ఒక్కొక్కరిని గుర్తించి.. దేశం వెలుపలికి తరిమికొడతామని హెచ్చరించారు. బెంగాల్ కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్‌లాంటి మహనీయులు కలలుగన్న బెంగాల్‌ను నిర్మిస్తామని, రాష్ట్ర సంస్కృతిని, పునరుజ్జీవనాన్ని కాపాడటానికి కృషి చేస్తామని తెలిపారు.
