అఖిలేశ్​ను గెలిపిస్తే మళ్లీ గూండా రాజ్‌ తెచ్చుకున్నట్టే

అఖిలేశ్​ను గెలిపిస్తే మళ్లీ గూండా రాజ్‌ తెచ్చుకున్నట్టే

యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బాగా వేడిగా సాగుతోంది. ప్రధాన పక్షాల మధ్య వాడీ వేడిగా విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ఇవాళ యూపీలోని మధురలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ప్రత్యర్థి పార్టీ అయిన సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. అఖిలేశ్ యాదవ్‌ను సీఎంగా గెలిపించడమంటే రాష్ట్రంలో అంతమైన గూండా రాజ్‌ను మరోసారి తెచ్చుకోవడమే అవుతుందని షా అన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో కీలకమైన నేత అజమ్‌ ఖాన్ అరెస్ట్ అయ్యారని, ఆయనపై అనేక కేసులు ఉన్నాయని, అయినా ఇప్పుడు అఖిలేశ్ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడడం సిగ్గు చేటని చెప్పారు. యూపీలో ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్స్, క్రిమినల్స్‌దే రాజ్యం అన్నట్టుగా నడిచేదని, వాళ్లను చూసి పోలీసులు కూడా భయపడేవాళ్లని అమిత్ షా అన్నారు. మహిళలు, యువతులు ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడే రోజులు ఉండేవని, 2017లో యోగి సీఎం అయ్యాక ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని,  గ్యాంగ్‌స్టర్లు, క్రిమినల్స్‌కు పోలీసులంటే దడ పుడుతోందని, వాళ్లే స్వయంగా వచ్చి పోలీసుల వద్ద లొంగిపోతున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక క్రిమినల్స్, గ్యాంగ్‌స్టర్లను జైళ్లలో పెట్టామని, యూపీలో కుటుంబ పాలన లేకుండా చేశామని, కులతత్వాన్ని లేకుండా చేసి, అభివృద్ధిపై ఫోకస్ పెట్టామని, ఇది ప్రజల కళ్లకు కట్టినట్టి కనిపిస్తోందని ఆయన అన్నారు.

యూపీ వెనుకబడితే దేశం వెనుకబడినట్టే

20 కోట్ల మంది ప్రజలు ఉన్న యూపీ లేకుండా భారత్ ముందుకు వెళ్లలేదని, ఇన్ని కోట్ల మంది అభివృద్ధికి దూరమైతే దేశం వెనుకబడినట్లేనని అమిత్ షా అన్నారు. బీజేపీపై యూపీ ప్రజలు ఉంచిన నమ్మకం, విశ్వాసంతోనే ఈ రాష్ట్రం ఇవాళ అభివృద్ధి బాటలో ముందుకు దూసుకెళ్తోందని చెప్పారాయన. దేశ భవితవ్యాన్ని నిర్ణయించేది యూపీనేనని, ఈ ఎన్నికల్లో కూడా యూపీలో బీజేపీని రెండోసారి గెలిపించి, అభివృద్ధిని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. అఖిలేశ్‌ను గెలిపిస్తే మళ్లీ అభివృద్ధి పోయి.. గుండా రాజ్ వస్తుందని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

చైనా చెరలోని బాలుడిని భారత్‌కు అప్పగింత

ఒమిక్రాన్‌ సోకితే 'డెల్టా' రాదన్న ICMR

సక్సెస్‎ఫుల్ వీర్యదాత.. 138 మందికి దానం