బెంగాల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల.. మహిళలకు నెలకు రూ.3వేలు

బెంగాల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల.. మహిళలకు నెలకు రూ.3వేలు

బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. మహిళా ఓటర్లను  ఆకట్టుకునేందుకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రకటించింది. బీజేపీని గెలిపిస్తే .. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతినెలా ప్రతి మహిళకు రూ.3వేలు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆరు నెలల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేస్తామని ప్రకటించింది. శుక్రవారం (ఏప్రిల్ 10)  కేంద్ర హోంమంత్రి, అమిత్ షా సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. 

పశ్చిమబెంగాల్ లో  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహిళలే టార్గెట్ గా బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది. టీఎంసీ అమలు చేస్తున్న  లక్ష్మీ భండార్ పథకానికి పోటీగా మహిళలకు నెలకు రూ.  3వేలు ఇస్తామని అమిత్ షా ప్రకటించారు. అంతేకాకుండా బీజేపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే పశ్చిమ బెంగాల్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో కలిసి పనిచేసే డబుల్ ఇంజిన్ సర్కార్  బెంగాల్ లో ఉండాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా బీజేపీ మేనిఫెస్టో కఠినమైన విధానాన్ని స్పష్టం చేస్తోంది. 'జీరో టాలరెన్స్' వైఖరిని నొక్కి చెబుతోంది.  మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, గుర్తించడం, నిర్మూలించడం, బహిష్కరించడమే మా విధానం అవుతుందని అమిత్ షా అన్నారు.