కేసీఆర్ ప్రభుత్వాన్ని పెకిలిద్దాం..రజాకార్ల మద్దతుతో సాగే కుటుంబ, అవినీతి పాలన అవసరమా? : అమిత్​ షా

కేసీఆర్ ప్రభుత్వాన్ని పెకిలిద్దాం..రజాకార్ల మద్దతుతో సాగే కుటుంబ, అవినీతి పాలన అవసరమా? : అమిత్​ షా
  • అన్ని వర్గాలను బీఆర్​ఎస్​ మోసం చేస్తున్నది
  • అమరవీరుల త్యాగాలను కేసీఆర్​ అవమానిస్తున్నడు
  • కొడుకును సీఎం చేయాలని ఆశపడ్తున్నడు
  • భద్రాద్రి రామయ్య దగ్గరికి ఆయన ఎందుకు పోడు?
  • మేం బీఆర్​ఎస్​, ఎంఐఎంతో వేదిక కూడా పంచుకోం
  • రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని ధీమా

ఖమ్మం/ ఖమ్మం రూరల్, వెలుగు :  రాష్ట్రంలో రైతులు, దళితులు, మహిళలు, యువత సహా అన్నివర్గాలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని, ఈ సర్కార్​ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూకటివేళ్లతో పెకిలిద్దామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. తొమ్మిదేండ్లుగా రజాకార్ల పార్టీతో అంటకాగుతూ, తెలంగాణ సమరయోధుల ప్రాణ త్యాగాలను కేసీఆర్​ అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలి. నాలుగు తరాల పార్టీ కాంగ్రెస్.. అది 4జీ పార్టీ. మూడు తరాల పార్టీ మజ్లిస్.. అది 3 జీ పార్టీ.  రెండు తరాలున్న పార్టీ బీఆర్ఎస్.. అది 2జీ పార్టీ.   4జీ, 3జీ, 2జీ  పార్టీలకు కాలం చెల్లింది. రాష్ట్రంలో రాబోయేది మోదీజీ ప్రభుత్వమే, బీజేపీ పార్టీనే” అని ధీమా వ్యక్తం చేశారు. 

ఆదివారం ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన ‘రైతు గోస-– బీజేపీ భరోసా’ బహిరంగ సభలో అమిత్​ షా మాట్లాడారు.  ‘‘ఇప్పుడే తిరుపతి వెంకటేశ్వరస్వామి, ఖమ్మం స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని వస్తున్న. తెలంగాణ విమోచనకోసం పోరాడిన సర్దార్ కేశవరావుకు నివాళులు అర్పిస్తున్న. రజాకార్ల మద్దతుతో రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన కొనసాగుతున్నది. కల్వకుంట్ల ప్రభుత్వానికి తిరోగమనం మొదలైంది” అని ఆయన అన్నారు. 

రామయ్యకు సీఎం పట్టు వస్త్రాలు ఎందుకిస్తలే?

కేసీఆర్​ ‘కారు’ భద్రాచలం వరకు వెళ్తుంది కానీ, ఆ రామయ్య దర్శనానికి మాత్రం వెళ్లడం లేదని అమిత్​ షా తెలిపారు. ‘‘రాములవారి కల్యాణానికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉంది. కానీ, ఎక్కడ ఒవైసీ బాధపడతాడేమోనని కేసీఆర్​ దాన్ని పక్కన పెట్టిండు. ఆయన కారు స్టీరింగ్​ ఒవైసీ చేతుల్లో ఉంది” అని మండిపడ్డారు. 

‘‘ఇక మళ్లీ కేసీఆర్​ సీఎం అయ్యేది లేదు. ఆయన భద్రాచలం వెళ్లబోయేది లేదు. వచ్చే ఏడాది అక్కడికి వెళ్లేది బీజేపీ సీఎం మాత్రమే. కొడుకు కేటీఆర్​ను సీఎం చేయాలని కేసీఆర్​ ఆశపడుతున్నడు” అని చెప్పారు. 

బీఆర్​ఎస్​తో వేదిక కూడా పంచుకోం

బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి, బెదిరింపులకు గురిచేస్తే వాళ్లు వెనక్కు తగ్గుతారని కేసీఆర్​ భ్రమపడుతున్నారని అమిత్​ షా మండిపడ్డారు. ‘‘అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్​ని అరెస్ట్ చేసి, అసెంబ్లీలో ఈటల రాజేందర్​ గొంతు నొక్కితే భయపడేది లేదు. కేసీఆర్.. నీ కొడుకు కేటీఆర్​ను ముఖ్యమంత్రి కానివ్వబోం. పేదలకు ఇండ్లు, యువతకు ఉద్యోగాలు, దళితులకు ఆర్థికంగా భరోసా ఇస్తం” అని అన్నారు. బీఆర్​ఎస్​తో పొత్తు  ప్రసక్తే లేదని, ఆ పార్టీతో వేదిక కూడా పంచుకోబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు రైతుల కోసం రూ.22వేల కోట్ల బడ్జెట్ పెడితే.. మోదీ ప్రభుత్వం రూ. లక్షా 28వేల కోట్ల బడ్జెట్ పెట్టిందని తెలిపారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం రూ. 7 లక్షల కోట్ల అప్పులు, ఇతర సబ్సిడీలిస్తే.. 

మోదీ ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల సహాయ సహకారాలు అందిస్తున్నది. కాంగ్రెస్  ప్రభుత్వం 475 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే, మోదీ ప్రభుత్వం 900 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కేంద్ర ప్రభుత్వం11 కోట్ల మంది రైతులకు రూ.2.60  లక్షల కోట్ల కిసాన్ సమృద్ధి నిధిని అందిస్తున్నది” అని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అప్పటి కాంగ్రెస్​  ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్ల నిధులు ఇస్తే, తొమ్మిదేండ్లలో బీజేపీ ఒక్క తెలంగాణకే రూ. 2.80 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. కేసీఆర్ ను ఇంటికి పంపి, బీజేపీని అధికారంలోకి తీసుకొద్దామని అమిత్ షా పిలుపునిచ్చారు. 

సభ సక్సెస్​.. పార్టీ విజయానికి ​సూచిక: పొంగులేటి సుధాకర్​రెడ్డి

రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని పార్టీ తమిళనాడు కో ఇన్​చార్జి, కోర్ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ‘‘ఖమ్మంలో ఆదివారం సభ విజయవంతం కావడమే వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయానికి సూచిక” అని చెప్పారు. సభ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న ఈ మీటింగ్ సక్సెస్​కు సహకరించిన పార్టీ నేతలకు, కేడర్​కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఖమ్మంలో బీజేపీ ఎక్కడ ఉందంటూ చేసిన అనేక దుష్ప్రచారాలకు దీటుగా పార్టీ కార్యకర్తలు సమాధానం చెప్పారు” అని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.

రాష్ట్రాన్ని ఫ్యామిలీకి గోల్డెన్​బౌల్​గా మార్చుకున్నడు: కిషన్​రెడ్డి

రాష్ట్ర రైతుల గోసను తెలియజేసి రైతన్నల్లో విశ్వాసాన్ని, భరోసాని ఇచ్చేందుకే ఈ సభను ఏర్పాటు చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘‘బీఆర్ఎస్ పాలనలో రైతన్నలు అన్ని రకాలుగా దగా పడుతున్నరు. పంటలకు బీమా లేదు.. సబ్సిడీ, పావలా వడ్డీ లేదు. రైతుబంధు ఒక్కటి ఇచ్చి మిగతావన్నీ కేసీఆర్​ ఎత్తేసిండు. తెలంగాణలో వ్యవసాయం 75 శాతం కౌలు రైతుల చేతుల్లోనే ఉంది. కౌలు రైతులు కేసీఆర్ చేతుల్లో మోసపోయారు. రాష్ట్రాన్ని సీడ్  బౌల్ చేస్తామని చెప్పి, కల్వకుంట్ల కుటుంబానికి గోల్డెన్ బౌల్ గా మార్చుకున్నడు. ఉచిత ఎరువులు ఇచ్చేందుకే కేసీఆర్ పుట్టినట్లుగా చెప్పి, ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిండు. ఐదేండ్లు గడుస్తున్నా ఉచిత ఎరువులు ఇవ్వడం లేదు. 

నాలుగున్నరేండ్లు రైతుల రుణమాఫీ మర్చిపోయి, ఎన్నికల ముందు తూతూ మంత్రంగా అమలు చేయాలని చూస్తున్నడు. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ, చక్రవడ్డీ పెరిగి అప్పు రెట్టింపయింది. రాష్ట్రంలో రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగినయ్​. కేసీఆర్ పాలనలో రైతాంగానికి ఏమాత్రం లాభం జరగడం లేదు” అని ఆయన తెలిపారు. వరదలు, తుపాన్లు, కరువులొచ్చినా నష్టపోతున్నది రైతులేనని, 9 ఏండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఫసల్​ బీమా అమలుచేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. 

ఇరిగేషన్ ప్రాజెక్టులను కేసీఆర్​ కమీషన్ల ప్రాజెక్టులుగా మార్చుకున్నారని, కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడినట్లుగా ధరణి మారిందని మండిపడ్డారు. ధరణితో 20 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం కోసం పనిచేస్తే, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకే గూటి పక్షులని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే సుస్థిరమైన అభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పారు. 

మోసం చేసుట్ల కేసీఆర్​కు పీహెచ్​డీ : బండి సంజయ్​

ఖమ్మం జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, కేసీఆర్​ దొంగ దీక్షను బయటపెట్టింది ఖమ్మం జిల్లానేని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  బండి సంజయ్​ అన్నారు. ‘‘మోసం చేయడంలో కేసీఆర్​ పీహెచ్​డీ పట్టా పొందిండు. ప్రొఫెసర్ జయశంకర్​ను అవమానపరిచిన మూర్ఖుడు కేసీఆర్. మళ్లీ మోసం చేయడానికి వస్తున్నడు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. కేసీఆర్​కు ఎన్నికలు వస్తేనే హామీలు యాదికొస్తయ్​.. ఎన్నికలు వస్తేనే  పేదోళ్లు గుర్తొస్తరు. ఉత్తప్పుడు ప్రజలు బాగోగులు ఆయనకు గుర్తుకు రావు. కాంగ్రెస్​తో కేసీఆర్​ లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నడు. ప్రజల సమస్యలు తీరాలంటే, బతులకు మారాలంటే, రామరాజ్యం రావాలంటే  మోదీ ఆధ్వర్యంలోని డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి” అని ఆయన తెలిపారు. 

బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్​ను మళ్లీ నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని అన్నారు. సభలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్​, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్​చార్జ్​ తరుణ్​ చుగ్​, రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్​ ప్రకాశ్​ జవదేకర్​,  సహ ఇన్​చార్జ్​ సునీల్ భన్సల్​, నేతలు మురళీధర్​ రావు, పొంగులేటి సుధాకర్​ రెడ్డి, వివేక్​ వెంకటస్వామి, గరికపాటి మోహన్​రావు, జితేందర్​ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సోయం బాపూరావు, ప్రేమేందర్​ రెడ్డి, బంగారు శృతి, రఘునందన్​రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, బహిరంగ సభ తర్వాత అమిత్ షా నేతృత్వంలో బీజేపీ కోర్​ కమిటీ సమావేశం జరిగింది.  

ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అబద్ధాలు చెప్తున్నడు. ఒవైసీతో పొత్తులో ఉన్న కేసీఆర్​తో బీజేపీ ఎట్ల పొత్తుపెట్టుకుంటది? ఈ రెండు పార్టీలతో కనీసం వేదిక కూడా పంచుకునే ప్రసక్తే లేదు. యూపీఏ ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకున్నది కేసీఆరే అనే విషయం గుర్తుంచుకోవాలి.
 

- కేంద్ర మంత్రి అమిత్​ షా