
- మమ్మల్ని సవాల్ చేసేటోళ్లకు బుద్ధి చెప్పినం
- పాక్, నేపాల్ బార్డర్ రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి మీటింగ్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి తగిన జవాబు ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మన సరిహద్దులను, సైన్యాన్ని, పౌరులను సవాల్ చేసే వారికి బుద్ధి చెప్పామని తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించదని చెప్పేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలను ఆర్మీ నాశనం చేసిందని చెప్పారు. తద్వారా ఉగ్రవాదం అణచివేత విషయంలో ప్రపంచానికి బలమైన సందేశం ఇచ్చామన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్, నేపాల్ బార్డర్ రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు, డీజీపీలతో అమిత్ షా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనునిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశ వ్యతిరేక శక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, పారామిలటరీ బలగాల సెలవులను హోంశాఖ రద్దు చేసింది. సెలవులో ఉన్న సిబ్బందిని వెంటనే వెనక్కి రప్పించాలని కేంద్ర
బలగాల చీఫ్‌లను అమిత్ షా ఆదేశించారు.