రైతు సంఘాల నేతలతో అమిత్ షా చర్చలు.. అర్ధరాత్రి దాకా కొనసాగిన మీటింగ్

రైతు సంఘాల నేతలతో అమిత్ షా చర్చలు.. అర్ధరాత్రి దాకా కొనసాగిన మీటింగ్

న్యూఢిల్లీ:  రైతు సంఘాల నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం భేటీ అయ్యారు. ‘భారత్ బంద్’ పూర్తయిన తర్వాత రాత్రి 8 గంటలకు వారితో సమావేశమయ్యారు. అర్ధరాత్రి దాకా చర్చలు కొనసాగాయి. పంజాబ్​కు చెందిన 8 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురు రైతు సంఘాల లీడర్లు మీటింగ్​లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ కూడా హాజరయ్యారు. తొలుత అమిత్​ షా రెసిడెన్స్​లో సమావేశం జరగాల్సి ఉండగా.. తర్వాత పూసాలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్​కు మార్చారు. మరోవైపు బుధవారం రైతులు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఆరో రౌండ్ చర్చలు జరగాల్సి ఉండగా.. తాము హాజరు కావడం  లేదని రైతు సంఘాలు ప్రకటించాయి.

రైతు సంఘాల నేతలతో అమిత్ షా చర్చలు

కేంద్ర మంత్రితో సమావేశం.. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న రైతు సంఘాల్లో విభేదాలు సృష్టించినట్లు తెలుస్తోంది. అధికారిక చర్చలకు ఒకరోజు ముందు సంప్రదింపులకు పిలవడాన్ని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ– ఉగ్రహాన్) తప్పుబట్టింది. అధికారిక చర్చలకు ముందు ఎలాంటి సంప్రదింపులు అవసరం లేదని జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ చెప్పారు. సమావేశానికి వెళ్లిన నేతలు.. రైతుల అభిప్రాయాలను దృష్టిలోనే ఉంచుకుంటారని
భావిస్తున్నామన్నారు.

ప్రభుత్వం కళ్లు తెరుచుకున్నయ్

భారత్ బంద్ సక్సెస్ అయిందని రైతు సంఘాల నేతలు చెప్పారు. 25 రాష్ట్రాల్లో ప్రభావం చూపిందని తెలిపారు. సింఘు బార్డర్​లో మీడియాతో మాట్లాడిన రైతులు.. తాము చేపట్టిన సూపర్ బంద్ ప్రభుత్వం కళ్లు, చెవులు తెరుచుకునేలా చేసిందని అన్నారు. బురారీ గ్రౌండ్.. ఓపెన్ జైలు అని, తాము అక్కడికి వెళ్లబోమని స్పష్టం చేశారు. రామ్​లీలా గ్రౌండ్ తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ, హర్యానా ప్రజలను ఇబ్బంది పెట్టడం తమకు ఇష్టం లేదన్నారు.