ఇయ్యాల నిర్మల్​కు అమిత్​షా

ఇయ్యాల నిర్మల్​కు అమిత్​షా
  • తెలంగాణ విమోచన దినోత్సవ సభకు హాజరు

హైదరాబాద్​/నిర్మల్‍, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుక్రవారం నిర్మల్‍కు రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ రమాదేవితోపాటు పార్టీ సీనియర్ నేతలు ప్రేమేందర్‍రెడ్డి, మంత్రి శ్రీనివాస్‍, రాంనాథ్ తదితరులు గురువారం సభ ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం నాందేడ్​ నుంచి అమిత్​ షా హైదరాబాద్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్​లో భీమన్న గుట్ట వద్దకు వస్తారు. నిర్మల్‍లో బ్రిటిష్‍, నిజాం సైన్యం వెయ్యి మంది గోండు వీరులను ఉరితీసిన మర్రిచెట్టు ప్రాంతాన్ని అమిత్‍షా సందర్శించి.. అమరవీరులకు నివాళులర్పిస్తారు. అనంతరం ఎల్లపెల్లి  క్రషర్​ ఏరియాలో జరిగే  బహిరంగ సభలో పాల్గొంటారు.