అసోంలో అమిత్ షా మూడో రోజు పర్యటన

అసోంలో అమిత్ షా మూడో రోజు పర్యటన

గువాహటి: అసోం రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. నిన్న గువాహటిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఇవాళ నిలాచల్ కొండల్లోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన అమిత్ షాకు దేవస్థానం అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అమ్మవారికి అమిత్ షా  ప్రత్యేక పూజలు చేశారు.

బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న అమిత్ షా

ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపేలా అమిత్ షా పర్యటిస్తున్నారు. మూడు రోజులపాటు పర్యటించిన ఆయన బీజేపీ యేతర పార్టీలకు చురకలు అంటిస్తూ.... ప్రజల్లో భరోసా నింపేలా ప్రయత్నించారు. సైన్యానికి ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్ పీఏ) రద్దుపై  స్పష్టత ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాతే ఆ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు.

ప్రధాని మోడీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలకు బడ్జెట్ మూడొంతులు పెంచి కేటాయించారని చెప్పారు. నిజమైన అభివృద్ధి జరుగుతోందని ప్రజలందరూ గుర్తిస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు.  గతంలో పాలించిన పాలకులు ఈశాన్య రాష్ట్రాల్లో అరాచకాలకు పాల్పడ్డారని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక సుమారు 9వేల మంది ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని అమిత్ షా తెలిపారు.