ఈటల, బండి సంజయ్​కి అమిత్​ షా క్లాస్

ఈటల, బండి సంజయ్​కి అమిత్​ షా క్లాస్
  • కలిసి నడవకపోతే సహించేది లేదని వార్నింగ్​
  • పార్టీకి నష్టం కలిగిస్తే ఎంతటి వారినైనా క్షమించం
  • ఒకరికి వ్యతిరేకంగా ఒకరు వార్తలు రాయించుకునుడేంది?
  • ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉంటే భారీ మూల్యం తప్పదు
  • ఇదే చివరి హెచ్చరిక.. రిపీటైతే చర్యలు తీసుకుంటం
  • కలిసి ప్రెస్​మీట్​ పెట్టాలని సూచన!
  • అయినా ఈటల ఒక్కరే మీడియా ముందుకు


రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతల మధ్య కొంత కాలంగా సాగుతున్న కోల్డ్ వార్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు. ఇప్పటి నుంచైనా కలిసి ముందుకు సాగాలని, లేకపోతే సహించేది లేదని ఈటల రాజేందర్​, బండి సంజయ్​కు ఆయన వార్నింగ్​ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే ఎంతటివారినైనా క్షమించేది లేదని,  ఇదే చివరి వార్నింగ్ అని, రిపీట్​ కానివ్వొద్దని హెచ్చరించినట్లు సమాచారం. లోక్​సభ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేసేందుకు ఒక రోజు పర్యటన కోసం గురువారం మధ్యాహ్నం హైదరాబాద్​కు అమిత్​ షా వచ్చారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్​లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఇందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్​, ఈటల రాజేందర్​, లక్ష్మణ్, ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్​ చుగ్ తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా అమిత్ షా.. పార్టీ ముఖ్య నేతల తీరుపై ప్రధానంగా చర్చించారు. నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకోవడం, సోషల్ మీడియాలో ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు పోస్టులు పెట్టుకోవడం, మీడియాకు లీకులు ఇవ్వడం.. ఇవన్నీ ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దిగజార్చే చర్యలని ఆయన మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల వేళ పార్టీ ముఖ్య నేతలంతా ఐక్యంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నలుగురు సిట్టింగ్ ఎంపీలు తిరిగి పోటీ చేసేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మిగతా 13 లోక్​సభ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, అభ్యర్థులు ఎవరనే దానిపై చర్చ సాగింది. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను అమిత్​ షాకు కిషన్ రెడ్డి వివరించారు. 

ఈ మీటింగ్ తర్వాత అమిత్​ షా..  కిషన్ రెడ్డి, ఈటల  రాజేందర్, బండి సంజయ్ ను అక్కడే ఉండమని, మిగతా నేతలను పంపించి వేశారు. ఈ ముగ్గురితో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. ఈటల రాజేందర్​, బండి సంజయ్  మధ్య విభేదాలను ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మీడియాలో ఒకరికి వ్యతిరేకంగా ఒకరు వార్తలు రాయించుకోవడం ఏమిటని ఆయన సీరియస్​ అయినట్లు సమాచారం. ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరించినట్లు తెలిసింది. ఇదే చివరి వార్నింగ్​ అని, రిపీటైతే చర్యలు తప్పవని తేల్చిచెప్పినట్లు సమాచారం. కీలక నేతలు పార్టీలో క్యాడర్ కు ఆదర్శంగా ఉండాలని, సమన్వయంతో ఇతర నేతలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. 

కలిసి ప్రెస్​మీట్​ అని చెప్పి..!

విభేదాలకు పుల్​స్టాఫ్​ పెట్టాలని, కలిసి ముందుకు సాగాలని ఈటల రాజేందర్​, బండి సంజయ్​కు అమిత్​ షా సూచించారు. ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వెళ్తే.. క్యాడర్ లోకి మంచి సంకేతాలు పంపించినట్లవుతుందని వారికి అమిత్ షా చెప్పారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు ఈటల రాజేందర్​, బండి సంజయ్​ ప్రెస్ మీట్ ఉంటుందని మీడియాకు బీజేపీ నుంచి అధికారిక సమాచారం ఇచ్చారు. అయితే.. ఆ సమాయానికి ఈటల రాజేందర్​ ఒక్కరే మీడియా ముందుకు  వచ్చారు. బండి సంజయ్ రాలేదు. అమిత్ షా చెప్పినా.. ఇద్దరు నేతల్లో మార్పు రాలేదని, ఇందుకు ప్రెస్​మీటే నిదర్శనమని పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది.