కరోనాను జయించిన అమితాబ్‌ బచ్చన్‌

కరోనాను జయించిన అమితాబ్‌ బచ్చన్‌
  • 23 రోజుల తర్వాత కరోనా నెగటివ్‌
  • హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌
  • ట్విట్టర్‌‌‌‌ ద్వారా వెల్లడించిన అభిషేక్‌ బచ్చన్

ముంబై: బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ కరోనా నుంచి కోలుకున్నారు. 77 ఏళ్ల అమితాబ్‌ బచ్చన్‌ 23 రోజుల పాటు ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. అమితాబ్ డిశ్చార్జ్‌ అయిన విషయాన్ని ఆయన కొడుకు, యాక్టర్‌‌ అభిషేక్‌ బచ్చన్‌ ట్విట్టర్‌‌ ద్వారా తెలిపారు. “ అదృష్టవశాత్తు మా నాన్నకు కరోనా నెగటివ్‌ వచ్చింది. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉంటూ రెస్ట్‌ తీసుకుంటారు. మా కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు” అని అభిషేక్‌ బచ్చన్‌ ట్వీట్‌ చేశారు. తనకు ఇంకా నెగటివ్‌ రాలేదని, కానీ కచ్చితంగా ఆరోగ్యంగా తిరిగొస్తానని అభిషేక్‌ బచ్చన్‌ చెప్పారు. అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌లకు జులై 11న కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిద్దరు నానావతి హాస్పిటల్‌లో చేరి ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. వారితో పాటు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, ఆమె కూతురికి కరోనా పాజిటివ్‌ రాగా.. వాళ్లను మొదట్లో హోం ఐసోలేషన్‌లో ఉంచిన డాక్టర్లు తర్వాత హాస్పిటల్‌కు తరలించారు. కొన్ని రోజులు ట్రీట్‌మెంట్‌ తీసుకున్న ఇద్దరు జులై 27న డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లిపోయారు. కాగా.. అమితాబ్‌ బచ్చన్‌ భార్య జయ బచ్చన్‌కు కరోనా నెగటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే.