
న్యూఢిల్లీ : కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని సీఎం కేసీఆర్ అంటున్నారని, కానీ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో తన దగ్గర అణాపైసాతో సహా లెక్కలు ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2014–15 నుంచి 2021–22 వరకు రూ.2.52 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను సరిగా వినియోగించుకొని ఉంటే ఈ నిధులు మూడున్నర లక్షల కోట్లు దాటేవని చెప్పారు. ‘‘రాష్ట్రంలోని వెనుకబడిన 9 జిల్లాలకు రూ.1800 కోట్లు, ట్రైబల్ జిల్లాల అభివృద్ధికి రూ.33 కోట్లు, రామగుండం ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ కోసం రూ.64 కోట్లు, ఎయిమ్స్ కోసం రూ.1,200 కోట్లు, సనత్ నగర్ ఈఎస్ఐ మెడికల్ ఆస్పత్రి కోసం రూ.1,200 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసం రూ.2,500 కోట్లు, హైదరాబాద్ లో ఎన్ఐసీఆర్ కోసం రూ.3 వేల కోట్లు, ముద్రా లోన్ల కోసం రూ.43 కోట్లు, హైదరాబాద్ మెట్రో కోసం రూ.661 కోట్లు, రైల్వే అభివృద్ధికి రూ.31,281 కోట్లు, రీజినల్ రింగ్ రోడ్డు కోసం రూ.8 వేల కోట్లు, సర్వ శిక్షాఅభియాన్ కోసం రూ.1300 కోట్లు ఇచ్చాం” అని తెలిపారు. ‘‘రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల లిస్ట్ చదువుతూ పోతే ఎలక్షన్లు కూడా వస్తాయి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పండి. అప్పుడప్పుడు నిజాలు కూడా చెప్పాలి’’ అని కేసీఆర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకరిస్తున్నా, రాష్ట్ర సర్కార్ నుంచే సహకారం అందడం లేదన్నారు. గురువారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ :
‘‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్”లో భాగంగా కేంద్రం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించింది. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రం ఏ రాష్ట్రంపైనా పక్షపాతం చూపదని అమిత్ షా అన్నారు. ఏ సీఎం ఢిల్లీకి వచ్చినా వారికి స్వాగతం పలుకుతామని, ప్రతి ఒక్కరికీ అపాయింట్ మెంట్ ఇస్తామని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందన్నారు. ‘‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్రం దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ కార్యక్రమ ఉద్దేశం అమరవీరులను, స్వాతంత్ర్య సమరయోధులను తలుచుకోవడం. అయితే దీనిపైనా కేసీఆర్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది” అని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన అమిత్ షా.. ఈ కార్యక్రమ ఏర్పాటుకు కృషి చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
విమోచన దినం నిర్వహిస్తం :
ఎనిమిదేండ్లయినా అమరవీరులు, ఉద్యమకారులు కలలుగన్న తెలంగాణను సాధించుకోలేకపోయామని అమిత్ షా అన్నారు.. ‘‘సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ చేపట్టకపోతే తెలంగాణ ఇలా ఉండేది కాదు. ఇప్పటికీ దేశంలో తెలంగాణ ఉండేది కాదు. నిజాం నిరంకుశ పాలన నుంచి పటేల్ విముక్తి కల్పించారు” అని అన్నారు. కానీ ఇప్పటికీ సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం మారబోతోందని, తాము కచ్చితంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు.
కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ :
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అమరవీరుల స్థూపానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి నివాళులు అర్పించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని, ఆ కుటుంబం నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రంపై టీఆర్ఎస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని, కేంద్ర పథకాల పేరు మార్చి, రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటోందని మండిపడ్డారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్.. తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తే.. సీఎం కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో ఉంటున్నారని కామెంట్ చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం, అమరవీరుల ఆశయ సాధనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కిషన్ రెడ్డి అన్నారు. ఎనిమిదేండ్లలో టైమ్ ప్రకారం రాష్ట్రానికి నిధులు ఇచ్చామని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో కేవలం కేసీఆర్ ఫాంహౌస్ కు మాత్రమే లాభం జరిగిందన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా నెరవేర్చని కేసీఆర్.. గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
మరిన్ని వార్తల కోసం : -
సమైక్యపాలన కన్నా అధ్వానంగా స్వపరిపాలన
తెలంగాణలో అధికారం మారుతుంది