వీర జవాన్ అర్షద్ ఖాన్ కుటుంబానికి అమిత్ షా పరామర్శ

వీర జవాన్ అర్షద్ ఖాన్ కుటుంబానికి అమిత్ షా పరామర్శ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండోరోజు జమ్ము కశ్మీర్ లో పర్యటించారు. శ్రీనగర్ లోని అనంతనాగ్ లో అమరవీరుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన SHO అర్షద్ ఖాన్ కుటుంబ సభ్యులను ఆయన కలుసుకున్నారు. వారి కుటుంబానికి కేంద్రప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. దేశ రక్షణ కోసం అర్షద్ ఖాన్ తన ప్రాణాన్ని త్యాగం చేశారని అమిత్ షా చెప్పారు. ఆయన ఎంతోమంది ప్రాణాలు కాపాడి వీరమరణం పొందారని అన్నారు. అర్షద్ ఖాన్ శౌర్య పరాక్రమాలను చూసి దేశం గర్వపడుతోందని చెప్పారు అమిత్ షా.

కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారి నిన్న బుధవారం జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లారు అమిత్ షా. మొదటి రోజు టూర్ లో జమ్ముకశ్మీర్ భద్రతపై సమీక్షించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాతి పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించారు. జులై 1 నుంచి ప్రారంభం కానున్న అమర్ నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లపైనా అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో భద్రతకు తీసుకుంటున్న చర్యలను అమిత్ షా కు వివరించారు అధికారులు. నిన్న రాత్రి రాజ్ భవన్ లో బస చేశారు అమిత్ షా.

రెండోరోజు గురువారం నాడు శ్రీనగర్ లో బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు అమిత్ షా. అలాగే.. పంచాయతీల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. స్థానిక లీడర్లు, టూరిజానికి సంబంధించిన ప్రతినిధులతో భేటీ అయ్యారు అమిత్ షా.